చేతులు జోడించి కోరుతున్నా.. అగ్నివీర్‌ పథకాన్ని ఆపండి : కేంద్రానికి అమర జవాన్‌ తల్లి విజ్ఞప్తి

భారత సైన్యంలోకి తాత్కాలిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్‌ పథకాన్ని వెంటనే నిలిపివేయాలని కీర్తిచక్ర పురస్కార గ్రహీత, అమర జవాన్‌ కెప్టెన్‌ అన్షుమన్‌ సింగ్‌ తల్లి మంజు సింగ్‌ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

చేతులు జోడించి కోరుతున్నా.. అగ్నివీర్‌ పథకాన్ని ఆపండి : కేంద్రానికి అమర జవాన్‌ తల్లి విజ్ఞప్తి

న్యూఢిల్లీ : భారత సైన్యంలోకి తాత్కాలిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్‌ పథకాన్ని వెంటనే నిలిపివేయాలని కీర్తిచక్ర పురస్కార గ్రహీత, అమర జవాన్‌ కెప్టెన్‌ అన్షుమన్‌ సింగ్‌ తల్లి మంజు సింగ్‌ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘అగ్నివీర్‌ పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నా. ఇప్పటికే నాలుగేళ్లు అయ్యాయి. ఇది సరైంది కాదు. సైనికులకు ఇచ్చే పెన్షన్‌, క్యాంటీన్‌, ఇతర అన్ని సదుపాయాలు కొనసాగించాలి’ అని ఆమె చెప్పారు. రాయ్‌బరేలీలో స్థానిక ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కలుసుకున్న అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్‌ అన్షుమన్‌ సింగ్‌కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై ఐదున ప్రదానం చేశారు.

సహచరులను రక్షించి..

పంజాబ్‌ రెజిమెంట్‌లోని ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌ 26వ బెటాలియన్‌కు చెందిన అన్షుమన్‌సింగ్‌.. 2023 జూలై 18, 19 తేదీల మధ్యరాత్రి సియాచిన్‌లో మందుగుండు సామగ్రి ఉన్న డంప్‌ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ చనిపోయారు. మంటలు అంటుకున్న డంప్‌లో గాయపడిన సహచరులను రక్షించిన అనంతరం ఔషధాలను కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చే క్రమంలో అన్షుమన్‌కు మంటలు అంటుకున్నాయి. చికిత్స పొందుతూ చనిపోయారు.

రాహుల్‌ చెబుతున్నది సరైనది

‘పురస్కార ప్రదాన కార్యక్రమం సందర్భంగా మేం ఆయనను (రాహుల్‌ గాంధీ) కలుసుకున్నాం. ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆయన రాయ్‌బరేలీలో, మేం లక్నోలో ఉంటుండటంతో ఆయనను కలవాలని అనుకున్నాం. నేను నా చిన్న కొడుకును కోల్పోయాను. రాహుల్‌ గాంధీ కూడా తన నానమ్మను, తన తండ్రిని కోల్పోయారు. ఆయనకు ఆ సహానుభూతి ఉంటుంది’ అని అన్షుమన్‌సింగ్‌ తండ్రి రవి ప్రతాప్‌ సింగ్‌ చెప్పారు. తమ మధ్య చర్చల్లో ఎక్కువ భాగం సైన్యం, అగ్నిపథ్‌ స్కీం గురించే వచ్చాయని మంజు సింగ్‌ చెప్పారు. ‘ఆయన సరిగ్గా చెప్పారు. రెండు రకాల సైనికులు ఉండకూడదు. ఆయన ఏం చెప్పారో ప్రభుత్వం వినాలి’ అని ఆమె అన్నారు.

ఇల్లు కట్టుకోవాలనుకున్నాం..

కీర్తిచక్ర పురస్కారాన్ని ప్రదానం కార్యక్రమం అనంతరం అన్షుమన్‌ భార్య స్మృతి సింగ్‌ మాట్లాడిన ఒక వీడియోను రక్షణ శాఖ విడుదల చేసింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ స్నేహం అనంతరం గత ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లయిన కొద్ది నెలలకు అన్షుమన్‌కు సియాచిన్‌లో పోస్టింగ్‌ వచ్చింది. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ముందు రోజే తామిద్దరం చాలాసేపు ఫోన్‌లో మాట్లాడుకున్నామని ఆమె ఆ వీడియోలో చెప్పారు.
పెళ్లయిన రెండు నెలలకే సియాచిన్‌లో పోస్టింగ్‌
అమర జవాన్‌ కెప్టెన్‌ సింగ్‌ పుణెలోని సాయుధ దళాల మెడికల్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. సియాచిన్‌లో ఆయనకు తొలి పోస్టింగ్‌ లభించింది. అక్కడ ఆయన ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌లో భాగంగా ఉన్నారు. ‘దురదృష్టవశాత్తూ మా పెళ్లయిన రెండు నెలలకే ఆయనకు సియాచిన్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. జూలై 18న మేం చాలా సేపు మాట్లాడుకున్నాం. ఇల్లు కట్టుకోవడం, పిల్లలను కనడం గురించి, రాబోయే 50 ఏళ్లు మా జీవితాలు ఎలా ఉండాలనే విషయంలో మాట్లాడుకున్నాం’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయమే కెప్టెన్‌ సింగ్‌ ఇక లేరంటూ ఆమెకు వర్తమానం అందింది.