President Vs Supreme Court | రాష్ట్రపతికే డెడ్ లైన్ విధిస్తారా? : సుప్రీం కోర్టుకు ముర్ము ప్రశ్నలు
రాష్ట్రాలు పంపే బిల్లులను గవర్నర్, రాష్ట్రపతి మూడు నెలల్లోగా ఆమోదించడమో.. తిప్పిపంపడమో చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ బిల్లులను తిప్పిపంపితే ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు తెలపాలని కోరింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.

- మీకు ఆ అధికారం ఎవరిచ్చారు?
- రాజ్యాంగంలో ఆ నిబంధన ఏది?
- సుప్రీం కోర్టుకు ముర్ము ప్రశ్నలు
President Vs Supreme Court | శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 3 నెలల్లోగా బిల్లులను ఆమోదించాలి.. లేదంటే తిప్పిపంపించాలని సుప్రీంకోర్టు నిర్దిష్టమైన గడువు విధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా తాజాగా సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలను ప్రశ్నించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రాజ్యాంగంలో అటువంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు ఎలా తీర్పు నిస్తుంది? అంటూ ఆమె ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న అధికారాలను వినియోగించుకొని రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థానానికి ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను గవర్నర్, రాష్ట్రపతి మూడు నెలల్లోగా ఆమోదించడమో.. తిప్పిపంపడమో చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ బిల్లులను తిప్పిపంపితే ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు తెలపాలని కోరింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా తాజాగా సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. ఈ మేరకు ఆమె అత్యున్నత న్యాయస్థానానికి ప్రశ్నలు సంధించారు.
రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలివే!
గవర్నర్లు తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు కోర్టులు గడువులు విధించవచ్చా? రాజ్యాంగం ప్రకారం కాలపరిమితి లేకపోయినప్పటికీ సుప్రీంకోర్టు కాలపరిమితి ఎందుకు విధిస్తున్నట్టు?
ఆర్టికల్ 200 కింద బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్‌కు అందుబాటులో ఉన్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటి?
గవర్నర్ కచ్చితంగా మంత్రి మండలి సలహాకు కట్టుబడే ఉండాలా?
ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణాధికారం వినియోగించడం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా?
ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలను న్యాయపరంగా పరిశీలించడానికి ఆర్టికల్ 361పై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తారా?
201 అధికరణం కింద రాష్ట్రపతి విచక్షణాధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా?
గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా?
ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందు గవర్నర్, రాష్ట్రపతి ఆర్టికల్ 200, 201 ప్రకారం తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధమైనవేనా?