భార్య మార్పిడికి భర్త బలవంతం.. భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు
కనిపెంచిన తల్లిదండ్రులను వదులుకొని అత్తారింటికి వచ్చే భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తే.. నీచానికి దిగజారాడు.

లక్నో: కనిపెంచిన తల్లిదండ్రులను వదులుకొని అత్తారింటికి వచ్చే భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తే.. నీచానికి దిగజారాడు. భార్య మార్పిడి (wife-swapping) దందాలో పాల్గొనాలని, వేరొకరి వద్ద అన్యోన్యంగా ఉండాలని భర్త తన భార్యను బలవంతం చేశాడు. అతని వేధింపులు భరించలేని భార్య పుట్టింటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అషియానా ప్రాంతంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అషియానాకు చెందిన ఓ 40 ఏండ్ల మహిళకు 2008లో వివాహమైంది. ఆమెకు ఓ కుమార్తె కూడా. ఇక భర్త ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. పెళ్లైనప్పటి నుంచి కట్నం తక్కువైందని వేధించేవాడు. మొదటి డెలివరీ తర్వాత ఆడబిడ్డ జన్మించిందని హింసించాడు. అంతటితో ఆగకుండా తన ముందే వేరే మహిళలతో ఫోన్లలో అసభ్యంగా మాట్లాడేవాడు. తనను వరకట్నం కోసం వేధించిన, ఆయన ఇతర మహిళలతో అన్యోన్యంగా ఉన్నా కూడా తానెప్పుడూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బాధితురాలు తెలిపారు.
అంతేకాకుండా రాత్రి సమయంలో తాను నిద్రిస్తున్నప్పుడు ఫొటోలు చిత్రీకరించి, వాటిని తన స్నేహితులకు కూడా చూపించేవాడు. మహిళలతో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తే కొట్టేవాడని ఆమె పేర్కొన్నారు. చివరకు తన ఫ్రెండ్స్‌తో భార్య మార్పిడికి ఒప్పుకోవాలని, లేదంటే చంపేస్తానని బెదిరింపులకు గురి చేసేవాడు. గుర్తు తెలియని వ్యక్తులతో తనను బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొనేలా హింసించేవాడని ఆమె వాపోయింది. ఇక భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.