మాజీ జడ్జీ ఇంట్లో నోట్ల కట్టల వివాదం.. నివేదికను బహిరంగపరచలేమన్న సుప్రీంకోర్టు

ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన అంశం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. దేశంలో న్యాయవ్యవస్థ మీద కూడా నమ్మకం పోతున్నదని పలువురు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై నిష్పాక్షింగా దర్యాప్తు జరపాలన్న డిమాండ్లు వినిపించాయి.
అయితే తాజాగా నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరకడంతో ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలేందుకు ప్రత్యేక కమిటీని వేసింది. అయితే తాజాగా ఈ కమిటీ ఇచ్చిన నివేదికను బహిరంగపరచడం కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ నివేదికకు సంబంధించిన వివరాలను బహిరంగపర్చాలని న్యాయస్థాన సమాచార అధికారికి ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నివేదికలోని అంశాలను బహిరంగపర్చలేమని కోర్టు తేల్చి చెప్పింది. సమాచారహక్కు చట్టంలోని సెక్షన్ 8(1)ఈ కింద వివరాలు అందించలేమని పేర్కొన్నది.
ఇందుకు సంబంధించిన 2019లో వెలువడ్డ సుభాష్ చంద్ర అగర్వాల్ కేసును కోర్టు ప్రస్తావించింది. గోప్యత హక్కు.. సమాచారహక్కు ఈ రెండింటి మధ్య సమతుల్యత అవసరమని కోర్టు వ్యాఖ్యానించింది. మార్చి 14వ తేదీన జడ్జి యశ్వంత వర్మ ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. న్యాయమూర్తి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ విషక్ష్ం వెలుగుచూసింది. అనంతరం ఈ వ్యవహారంపై ముగ్గురు జడ్జిలతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మే 3వ తేదీన తుది నివేదిక రూపొందించి అప్పటి సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నాకు అందజేశారు.