Medical Colleges | వైద్య కళాశాలల్లో మూడేళ్లలో పూర్తి స్థాయి వసతులు : సీఎం రేవంత్‌రెడ్డి
Medical Colleges | రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి… ఎంత మేర నిధులు కావాలి.. తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు… ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమర్పించాలని సీఎం ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఐసీసీసీలో సోమవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో (Medical Colleges) నియామకాలు, బోధన సిబ్బందికి ప్రమోషన్లు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో పడకల పెంపు, ఆయా కళాశాలలకు అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీ వీటన్నింటిపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలని, కేంద్ర మంత్రి నడ్డా, ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు.
నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్ గా జపాన్ భాష
నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ (జపాన్ భాష) ను ఒక ఆప్షనల్‌గా నేర్పించాలని, జపాన్‌లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మనకు మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆసుపత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. విద్యా, వైద్య రంగాలు ఎంతో కీలకమని, ప్రతి నెలా మూడో వారంలో ఈ రెండు శాఖలపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూ, వైద్యారోగ్య శాఖ డైరెక్టరేట్ డాక్టర్ నరేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram