NMMTA । మెడికల్ సైన్స్ నుంచి ‘సైన్స్‌’ను తొలగించే యత్నం!

మెడికల్ ఎమ్మెస్సీ, మెడికల్ పీహెచ్‌డీ టీచర్లను తొలగించడం అంటే.. మెడికల్ సైన్స్ నుంచి సైన్స్‌ను తొలగించినట్టేనని NMMTA అధ్యక్షుడు డాక్టర్ అర్జున్ మైత్రా అన్నారు. వారి తొలగింపు మొత్తం వైద్య విద్య వ్యవస్థ మీద తీవ్ర పర్యవసానాలు కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.

NMMTA । మెడికల్ సైన్స్ నుంచి ‘సైన్స్‌’ను తొలగించే యత్నం!
  • ఎన్‌ఎంసీ విధాన మార్పులపై ఎన్‌ఎంఎంటీఏ ఆందోళన
  • మెడికల్ ఎడ్యుకేటర్ల భవిష్యత్తు అగమ్యగోచరం
  • యావత్ హెల్‌కేర్ వ్యవస్థపై తీవ్ర పర్యవసానాలు
  • పాలసీ రద్దుకు ఎన్‌ఎంఎంటీఏ డిమాండ్‌

NMMTA । నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తాజాగా తీసుకొచ్చిన విధాన మార్పుల భారతదేశంలోని మెడికల్ ఎమ్మెస్సీ, మెడికల్ పీహెచ్‌డీ ఎడ్యుకేటర్స్ తీవ్ర జీవనోపాధి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, అది వారి మానసిక ఆరోగ్య పరిస్థితిని దిగజారుస్తున్నదని, వృత్తిపరమైన అనిశ్చితిని ఎదుర్కొనాల్సి వస్తున్నదని ది నేషనల్ మెడికల్ ఎమ్మెస్సీ టీచర్స్ అసోసియేషన్ (NMMTA) ఆందోళన వ్యక్తం చేసింది. వీరు ఎదుర్కొంటున్న సమస్యలపై సత్వరమే దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు ఒక మీడియా ప్రకటనను విడుదల చేసింది. భావి వైద్యుల ప్రాథమిక శిక్షణకు కేంద్రంగా ఉన్న ఈ అత్యంత నైపుణ్యం కలిగిన ఎడ్యుకేటర్లు.. ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలతో తీవ్రంగా ప్రభావితమవుతున్నారని తెలిపింది.

అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మాకాలజీ వంటి కీలకమైన సబ్జెక్టుల బోధనలో మెడికల్ ఎమ్మెస్సీ, మెడికల్ పీహెచ్‌డీ ఎడ్యుకేటర్లు అనేక ఏండ్లుగా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే.. ఇటీవల తీసుకొచ్చిన పాలసీ రివిజన్‌లో మెడికల్ కాలేజీల్లో వీరి ప్రాతినిధ్యాన్ని గణనీయంగా తగ్గించారు. నాన్ క్లినికల్ సబ్జెక్టుల్లో వారి భాగస్వామ్యాన్ని 30 శాతం నుంచి 15 శాతానికి కుదించారు. మైక్రోబయాలజీ, ఫార్మాకాలజీ వంటి సబ్జెక్టుల్లో పూర్తిగా తొలగించారు. ఈ చర్య వేల మంది ప్రొఫెషనల్స్ జీవనోపాధులను, వైద్య విద్య నాణ్యతను ప్రమాదంలో పడేస్తున్నదని NMMTA పేర్కొన్నది. ఇది అంతిమంగా భారతదేశ ఆరోగ్య రక్షణ వ్యవస్థను దీర్ఘకాలంలో తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర తీసుకొచ్చిన పాలసీ మార్పులు ఎడ్యుకేటర్లను అసాధ్యమైన పరిస్థితికి నెట్టేశాయని పేర్కొన్నది. వారి భవితవ్యం ప్రశ్నార్థకమై, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ ఎడ్యుకేటర్లలో అనేక మంది దశాబ్దాల అనుభవం కలిగినవారని, ఇప్పుడు వారు తమ కెరీర్‌ను కోల్పోవాల్సి రావడంతో తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని NMMTA తెలిపింది. ప్రత్యేకించి కెరీర్ మధ్య దశ, చివరి దశల్లో ఉన్నవారు ఉద్యోగాలు పోతున్నాయన్న తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నది.

‘మా జీవనోపాధి కోసం చేసుకున్న విజ్ఞప్తులను ఎన్‌ఎంసీ బుట్టదాఖలు చేసింది. వైద్య కళాశాలల్లోని మెడికల్ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ టీచర్లు ఎన్‌ఎంసీ, ప్రత్యేకించి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (UGMEB) కొనసాగిస్తున్న వివక్షతో విసిగి వేశారిపోయారు’ అని NMMTA అధ్యక్షుడు డాక్టర్ అర్జున్ మైత్రా పేర్కొన్నారు. ఎన్‌ఎంసీ చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘కెరీర్ మధ్య, చివరి దశల్లో అనిశ్చిత భవిష్యత్తు ఉంటుందనే భయం వారి ఆరోగ్యం, మనస్సుపై ప్రభావం చూపుతున్నది. ఈ ఎడ్యుకేటర్లు దశాబ్దాలుగా వైద్య విద్యకు అంకితమై పనిచేస్తున్న ఉన్నత శిక్షణ పొందిన నిపుణులు. NMC విధానాలు వారి కెరీర్‌లను, జీవనోపాధిని క్రమపద్ధతిలో నాశనం చేస్తున్నాయి’ అని ఆయన చెప్పారు. UGMEB ఉద్దేశపూర్వకంగానే అత్యున్నత నైపుణ్యం కలిగిన టీచర్లను మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని అర్జున్ మైత్రా ఆరోపించారు. దాదాపు 5వేల మందిని ఈ విధానాలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. మెడికల్ ఎమ్మెస్సీ, మెడికల్ పీహెచ్‌డీ టీచర్లను తొలగించడం అంటే.. మెడికల్ సైన్స్ నుంచి సైన్స్‌ను తొలగించినట్టేనని ఆయన అన్నారు. వారి తొలగింపు మొత్తం వైద్య విద్య వ్యవస్థ మీద తీవ్ర పర్యవసానాలు కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.

అకడమిక్ ప్రమాణాలు తగ్గించడం, అడ్మిషన్ పాలసీలో రిలాక్సేషన్లు ఇవ్వడం బదులు వైద్య విద్య అకడమిక్ పునాదిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం, ఎన్‌ఎంసీ దృష్టిసారించాలని ఎన్‌ఎంఎంటీఏ కార్యదర్శి డాక్టర్ అయన్ కుమార్ దాస్ అన్నారు. మెడికల్ ఎమ్మెస్సీ, మెడికల్ పీహెచ్‌డీ ఎడ్యుకేటర్ల తగినంత సంఖ్యలో ఉంటే భావి వైద్యుల క్లినికల్ శిక్షణను మరింత మెరుగుపర్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్‌ఎంసీ తీసుకొచ్చిన విధానపరమైన మార్పులు వైద్య విద్య సమగ్రతను రాజీపడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యావత్ హెల్త్‌కేర్ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని చెప్పారు.