Pattudala Review: ప‌ట్టుద‌ల సినిమా రివ్యూ.. అజిత్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

  • By: sr    news    Feb 06, 2025 4:09 PM IST
Pattudala Review: ప‌ట్టుద‌ల సినిమా రివ్యూ.. అజిత్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

సినిమా రివ్యూ: ప‌ట్టుద‌ల (విదాముయార్చి) (Pattudala)
విడుదల: 06–02–2025
నటీనటులు: అజిత్‌, అర్జున్‌, త్రిష‌, రెజినా, అర‌వ్‌ తదితరులు
కెమెరా: ఓం ప్ర‌కాశ్‌
సంగీతం: అనిరుద్ ర‌విచంద్ర‌న్‌
ఎడిటింగ్‌: ఎన్బీ శ్రీకాంత్‌
నిర్మాణం: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
దర్శకత్వం: మగిజ్ తిరుమేని (Magizh Thirumeni)

విధాత ప్ర‌త్యేకం: త‌మిళనాట ర‌జ‌నీకాంత్ స్థాయిలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉన్న ఆగ్ర‌ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) సుమారు రెండేండ్ల విరామం త‌ర్వాత న‌టించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ విదాముయార్చి. సుమారు రూ.250 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన చిత్రం ఫిబ్ర‌వ‌రి 06 గురువారం త‌మిళంతో పాటు తెలుగులో ప‌ట్టుద‌ల (Pattudala) పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని అవాంత‌రాలు దాటుకుని ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. అయితే.. త‌మిళంలో చాంతండంతా పేరుతో ఉండే అజిత్‌ సినిమాల పేర్లు తెలుగులో విడుద‌ల‌కు వ‌చ్చేస‌రికి విశ్వాసం, తెగింపు, ప‌ట్టుద‌ల అంటూ నిండైన అచ్చ తెగులు ప‌దాల‌తో ఆక‌ర్షించ‌డం, ఆక‌ట్టుకోవ‌డం అన‌వాయితీ అయింది. కాస్త గ్యాప్‌ త‌ర్వాత అజిత్ సినిమా రావ‌డం, ఓ హాలీవుడ్ చిత్రానికి రిమేక్ అని పేరు తెచ్చుకున్న ఈ చిత్రం మ‌రి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిందా, క‌థేంటి, సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం.

క‌థ‌: అజ‌ర్‌బైజాన్ (Azerbaijan) అనే దేశంలో ఓ అమెరిక‌న్ కంపెనీలో అర్జున్ (అజిత్‌) ఉద్యోగం చేస్తూ భార్య కాయ‌ల్ (త్రిష‌)తో క‌లిసి బాకూ అనే సిటిలో నివ‌సిస్తూ ఉంటాడు. పెళ్లైన ఎనిమిదేండ్ల‌కు గ‌ర్బ‌వ‌తి అయిన కాయ‌ల్ అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదంలో దానిని కోల్పోవాల్సి వ‌స్తుంది. అప్ప‌టి నుంచి భార్య‌భ‌ర్త‌లిద్ద‌రు ముభావంగా, మ‌న‌సు విక‌లం చెంది స‌రిగ్గా క‌లిసి ఉండ‌లేక పోతారు. కొన్నాళ్ల త‌ర్వాత‌ కాయ‌ల్ త‌న‌కు మ‌రో వ్య‌క్తితో సంబంధం ఉంద‌ని అర్జున్‌కు చెప్పి విడాకులు తీసుకుందామ‌ని కోరుతుంది. ఆపై త‌న అమ్మ‌వాళ్ల ఇంటికి వెళ‌తాన‌న్న కాయ‌ల్‌ను అర్జున్ స్వ‌యంగా కారులో తీసుకెళ్లి దింపడానికి బ‌య‌లు దేరుతారు. అలా బ‌య‌లు దేరిన వారికి మార్గంమ‌ధ్య‌లో వారి కారు బ్రేక్‌డౌన్ అవుతుంది. Pattudala Review

స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఈ రూట్లోనే ట్ర‌క్‌ లోడ్‌తో వెళుతున్న‌ ర‌క్షిత్ (అర్జున్‌), దీపిక (రెజినా) ల‌ను ప‌రిచ‌యం చేసుకుని కాయ‌ల్‌ను ద‌గ్గ‌ర్లో ఉన్న జ‌బ్బ‌ర్ హోట‌ల్ వ‌ద్ద దింపాల‌ని కారు బాగు చేసుకుని త్వ‌ర‌గా వ‌స్తాన‌ని చెబుతాడు. కారు బాగ‌య్యాక అక్క‌డి వెళ్లిన అర్జున్‌కు త‌న భార్య క‌నిపించ‌దు. ఇక్క‌డికి అలాంటి వారెవ‌రూ రాలేద‌ని అక్క‌డి వాళ్లు చెబుతారు. దీంతో అర్జున్ ఓ ట్ర‌క్‌ను ఫాలో అయి ర‌క్షిత్‌ను త‌న భార్య గురించి అడ‌గ్గా నాకు ఏం తెలియ‌ద‌ని, ఇప్పుడే ఫ‌స్ట్ టైం చూస్తున్నాన‌ని చెబుతాడు. పోలీసులు వ‌చ్చి వెతికినా, స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి లాభం లేకుండా పోతుంది. తిరిగి హోట‌ల్ ద‌గ్గ‌రికి వ‌చ్చిన అర్జున్‌కు అక్క‌డో మ‌నిషి చెప్పిన ఓ క్లూ అధారంగా కాయ‌ల్‌ను కావాల‌ని కిడ్నాప్ చేశార‌ని తెలుస్తుంది. ఈ క్ర‌మంలో అస‌లు కాయ‌ల్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారు, దీని వెన‌కాల ఉన్న సూత్ర‌ధారి ఎవ‌రు, ర‌క్షిత్, దీపిక‌ల బ్యాగ్రౌండ్ ఏంటి, అర్జున్ త‌న చుట్టూ ఉన్న ప‌ద్మ‌వ్యూహాన్ని ఎలా చేధించాడు, చివ‌ర‌కు కాయ‌ల్‌ను క‌నిపెట్ట‌గ‌లిగాడా, విడాకులు తీసుకున్నారా లేదా అనే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌: ద‌ఆదాదాపు రేండేండ్ల విరామం త‌ర్వాత అజిత్ నుంచి ఓ సినిమా అది కూడా కార్ ఛేజింగ్స్, యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో క‌ట్ చేసిన ట్రైల‌ర్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచ‌నాల‌ను పెంచేసింది. 1997లో హాలీవుడ్‌లో వ‌చ్చిన బ్రేక్‌డౌన్ (Breakdown), 2022లో వ‌చ్చిన లాస్ట్ సీన్ ఎలైవ్ (Last Seen Alive) అనే సినిమాల అధారంగా తెర‌కెక్కిన ఈ మూవీని పూర్తిగా అజ‌ర్‌బైజాన్ నేప‌థ్యంలోనే అక్క‌డే చిత్రీక‌రించడంతో ఇక్క‌డ‌ మ‌న‌వాళ్లకు క‌నెక్ట్ అవ‌డానికి స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. మూవీ మొద‌టి 10 నిమిషాలు బాగా లాగ్ చేసిన‌ట్లు అనిపించిన‌ప్పటికీ కారు రోడ్డెక్కింది మొద‌లు సినిమా అయిపోయేంత వ‌ర‌కు త‌ల తిప్పుకోకుండా చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్ మెయుంటెన్ చేయ‌డంలో బాగా స‌క్సెస్ అయ్యారు. అయితే సినిమా చూస్తున్నంత సేపు, చూశాక సూప‌ర్ ఉంద‌నే ఫీల్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అజిత్ అస‌లు ఈ సినిమా ఎలా చేశాడు.. ఇది అత‌ని రేంజ్ కాదు క‌దా అనే భావ‌న రావ‌డం మాత్ర గ్యారంటీ. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, సెకండాఫ్‌లో వ‌చ్చే సీన్లు సినిమాకు హైలెట్‌గా నిల‌వ‌గా మిస్స‌యిన భార్య‌ను వెతికే క్ర‌మంలో వ‌చ్చే సీన్లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. కొన్ని సీన్ల‌లో లోక‌ల్ ల్యాంగ్వేజ్ వ‌చ్చిన ప్ర‌తి సారి చెప్పిన‌ తెలుగు డ‌బ్బింగ్ విష‌యంలో సినిమా చూస్తున్న‌ వారిని బాగా క‌న్ఫ్యూజ‌న్ చేస్తుంది. అయితే స్క్రీన్ ప్లే విష‌యంలో నేటిక‌నుగుణంగా కొన్ని మార్పులు చేసి ఉంటే ఇంకా బావుండేది. Pattudala Review

ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. సినిమా అసాంతం ఐదారు క్యారెక్ట‌ర్లు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అజిత్ సినిమా మొత్తం స్మార్ట్‌గా క‌నిపించ‌డంతో పాటు యాక్ష‌న్ సీన్ల‌లోనూ అద‌ర‌గొట్టాడు. యాక్ష‌న్ కింగ్ అర్జున్, త్రిష‌, రెజినా, అర‌వ్ వారి వారి పాత్ర‌ల్లో బాగా సెట్ట‌య్యారు. ఇక టెక్నిక‌ల్‌గా సినిమా ఫ‌స్ట్ నుంచి లాస్ట్ షాట్ వ‌ర‌కు విజువ‌ల్స్ ప‌రంగా రిచ్‌గా ఓ హాలీవుడ్ సినిమాను చూస్తున్నామ‌నే ఫీల్‌ను క‌లిగించ‌డంలో డీవోపీ సూపర్ స‌క్సెస్ అయ్యాడు. అనిరుధ్ సంగీతం కూడా సిట్యూవేష‌న్ హైలెట్ చేసేలా ఉన్నాయి. పాటలు మాత్రం అంత‌గా క్యాచీగా, గుర్తు పెట్టుకునే విధంగా అయితే లేవు. నిర్మాత లైకా శుభాస్క‌రన్ పెట్టిన ప్ర‌తి రూపాయి సినిమాలో ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపిస్తుంది. ఇక అస‌లు కోస‌మెరుపేంటంటే.. ఫ‌స్టాప్ అంతా ఫ్యామిలీ, రోడ్ ట్రిప్‌, భార్య కోసం సెర్చింగ్ సాగ‌గా.. సెకండాఫ్ స్టార్ట్ అయిన 10 నిమిషాల త‌ర్వాత‌నే యాక్ష‌న్ ఎపిసోడ్స్ స్టార్ట్ అవ‌డం విశేషం.

 

ట్యాగ్‌లైన్‌: స‌డ‌ల‌ని ప‌ట్టుద‌ల‌