Telangana I & PR: తెలంగాణ ఐఅండ్‌పీఆర్.. ఆంధ్రా చేతుల్లో బందీ!

Telangana I & PR
- మంత్రికి పట్టదు, కమిషనర్ పట్టించుకోరు
- సమీక్షలు సున్నా, నియామకాలు లేవన్నా..
- శాఖ మంత్రి తప్ప ముగ్గురు ఆంధ్రావాళ్లే
- వారికింద పాలేర్లలా తెలంగాణ సిబ్బంది
- ప్రత్యేక తెలంగాణలోనూ ఆంధ్ర పెత్తనాలే
- సమాచార శాఖ ఉద్యోగుల్లో జోరుగా చర్చలు!
హైదరాబాద్, (విధాత): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవతరించిందని చంకలు గుద్దుకోవడమే కానీ ఎక్కడ చూసినా ఆంధ్రా పెత్తనం గుబాలిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలంగాణలో ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి ఆంధ్రావాళ్లను నియమించుకోవడానికి ఆంధ్రా పాలక పెద్దలు సైతం కొంత తటపటాయించేవారు. కానీ గత పదేళ్లుగా ఎక్కడ చూసినా ఆంధ్రా వాళ్లదే రాజ్యం నడుస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. వాళ్ల కింద తాము పాలేర్లుగా పనిచేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఐఅండ్ పీఆర్ మంత్రిగా ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నా, ఆ శాఖలో కీలక పదవుల్లో ఆంధ్రులు రాజ్యమేలుతున్నారన్న చర్చ జోరుగా వినిపిస్తున్నది.
పదేళ్లుగా నియామకాల్లేవు
తెలంగాణ ముఖ్యమంత్రిగా పదేళ్లు పనిచేసిన కేసీఆర్ పుణ్యమాని దశాబ్దకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ముచ్చటే లేదు. జోనల్ వ్యవస్థ అంటూ కొన్నేళ్లు వాయిదా వేశారు. ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. ఐఅండ్‌పీఆర్‌లో ప్రభుత్వం అనుమతించిన పోస్టులు అన్ని స్థాయిల్లో కలుపుకొంటే సుమారు 700 వరకు ఉన్నాయి. పదవీ విరమణలతో ఏటా ఖాళీలు పెరుగుతూ వచ్చాయి. 2023 ఫిబ్రవరిలో 164 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పదవులు భర్తీ చేస్తే ప్రస్తుతం పనిచేసే అధికారులు, ఉద్యోగులపై పనిభారం తగ్గడమే కాకుండా పదోన్నతులు లభిస్తాయి. అందరూ కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించే వెసులుబాటు లభిస్తుంది. ఇదిలా ఉంటే చిట్టి చిట్టి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.
పబ్లిక్ రిలేషన్స్ అధికారులు లేకపోవడంతో మెదక్, సూర్యాపేట, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆడియో విజువల్ సూపర్ వైజర్లు డీపీఆర్వోలుగా పనిచేస్తున్నారు. ఇవే కాకుండా సమాచార భవన్‌లో అడిషనల్ డైరెక్టర్‌తోపాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో సీపీఆర్వో, డీజీపీ కార్యాలయంలో కూడా సీపీఆర్వో పోస్టు ఖాళీగా ఉన్నాయి. శాశ్వత నియామకాలు జరిగితే కాంట్రాక్టు పద్దతిపై తీసుకున్న వారిని బయటకు పంపించాల్సి ఉంటుందనే ఉద్ధేశంతో ఆంధ్రా ప్రాంత అధికారులు అడ్డంకులు పెడుతున్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ డైరెక్టర్లందరూ హైదరాబాద్‌లో కూర్చుని పనిచేయడం విశేషం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్యకర్త మాదిరి పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్.. తన హయాంలో జిల్లాల్లో పనిచేసే డీడీలను హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై తీసుకువచ్చి పని లేకుండా చేశారన్న విమర్శలు ఉన్నాయి. మంత్రుల వద్ద పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు ఔట్ సోర్సింగ్ విధానంలో పీఆర్వోలుగా పనిచేస్తున్నారు.
18 నెలలు అయినా సమీక్షలు లేవు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాదిన్నర అవుతున్నది. ఇప్పటి వరకు ఐఅండ్ పీఆర్ కమిషనర్ లేదా డైరెక్టర్ లేదా స్పెషల్ కమిషనర్‌గా కే అశోక్ రెడ్డి, ఎం హన్మంతరావు పనిచేసి బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఎస్ హరీశ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. శాఖలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? ఏ సమస్యలు ఉన్నాయి? ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నారా? అనే అంశాలపై ఇంత వరకు సమీక్షలు నిర్వహించలేదు. కనీసం జిల్లాలకు వెళ్లి తనిఖీలు నిర్వహించిన పాపాన పోలేదని, వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్న సిబ్బందిని క్షేత్రస్థాయిలో పనిచేయించుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది. వీరిది ఇలా ఉంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన దృష్టినంతా రెవెన్యూ, హౌసింగ్‌పైనే ప్రధానంగా కేంద్రీకరించారని అంటున్నారు. ఏదో మొక్కుబడిగా ఐఅండ్ పీఆర్ బాధ్యతలు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖలో ఏం జరుగుతున్నది? ప్రభుత్వం తరఫున ఏం చేయాలి? అనేది కూడా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఐఅండ్ పీఆర్‌పై ప్రేమతో బాధ్యతలు తీసుకున్నారా? లేక పత్రికలు, చానళ్లపై ఆధిపత్యం కోసం తీసుకున్నారా? అనే సందేహాలను వారు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ శాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా, తన ప్రచారం కోసమే వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రా గుబాళింపు
ప్రస్తుత ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ఎస్ హరీశ్ కుమార్ రెడ్డి ఏపీలోని కడప జిల్లా వాస్తవ్యులు. రాష్ట్ర విభజన తరువాత ఆయనను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడంతో ఇక్కడే కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ చీఫ్ ఇంజినీర్ ఎల్ఎల్ఆర్ కిశోర్ బాబుకు అక్రమంగా పౌర సంబంధాల విభాగంలో డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారనే విమర్శలు ఉన్నాయి. ఏపీ విభజన చట్టం ప్రకారం చీఫ్ ఇంజినీర్ పదవిని ఏపీకి కేటాయించారని, తెలంగాణలో ఆ పోస్టు లేదని పలువురు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటూనే ఐఅండ్‌పీఆర్ శాఖను పర్యవేక్షించిన కేసీఆర్‌కు ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకపోయిందని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా పౌర సంబంధాల విభాగంలో డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి, సచివాలయంలో కూర్చోబెట్టారని వారు చెబుతున్నారు. మొన్నటి వరకు దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రికలో రెసిడెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తించిన కర్రి శ్రీరామ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఅండ్ పీఆర్‌లో మీడియా అండ్ కమ్యునికేషన్స్ డైరెక్టర్‌గా గతేడాది సెప్టెంబర్ నెలలో నియమించడం రాజకీయంగా ఆసక్తి రేపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం వాసి అని చెబుతున్నప్పటికీ ఈయన మూలాలు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయని సమాచారం.
ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాస రాజు (రిటైర్డు ఐఏఎస్) పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే ఆ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా వీ శేషాద్రి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో పనిచేసి, తెలంగాణకు వచ్చిన శేషాద్రికి విశేష అనుభవం ఉన్నప్పటికీ, శ్రీనివాసరాజును నియమించడంలో ఆంతర్యం ఏమిటన్న సందేహాలను పలువురు ఉద్యోగులు లేవనెత్తుతున్నారు. ఈయన కూడా ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారే. అంతేకాదు.. గతంలో టీటీడీలో జాయింట్ ఈవోగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తరువాత, టీటీడీ ఈవో పోస్టు కోసం ప్రయత్నించారని, అయితే.. ఆ పోస్టులో శ్యామలరావు నియామకంతో వెనక్కు తగ్గారని తెలుస్తున్నది. ఏపీలో ఐఏఎస్ అధికారిగా కొనసాగలేక తన పదవికి 2024 జూన్‌లో వీఆర్ఎస్ తీసుకున్న శ్రీనివాసరాజు.. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులకు సలహాదారుడిగా నియమితులయ్యారు. ఏం జరిగిందో ఏమో కానీ.. గత నెలలో సీఎం కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టి, ఐఅండ్ పీఆర్‌ను తన పరిధిలోకి తీసుకున్నారు. శ్రీనివాసరాజుకు కేటాయించే ముందు కరీంనగర్ జిల్లావాసి ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్ ఈ బాధ్యతలను పర్యవేక్షించేవారు. ఇలా కీలక పదవుల్లో ఆంధ్రకు చెందినవారే కీలక పాత్రలు పోషిస్తున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.