Telugu States Rain Alert | ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వర్ష సూచన: ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు-భారీ వర్షాలు; గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తరకోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక నంద్యాల, కర్నూల్, బాపట్ల, గుంటూరు,నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదుల్లో వరద పెరిగింది. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఈ నదులకు వరద పోటెత్తింది. తెలంగాణ జిల్లాల మీదుగా కృష్ణా, గోదావరి నదుల నీరు ఏపీకి చేరుతోంది. దీంతో ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ అధికారులు కోరారు.
ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ ,నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, నిర్మల్, ఆసిపాబాద్, పెద్దపల్లి, ములుగు, ఆదిలాబాద్, హన్మకొండ, ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం
,మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.