VRA, VRO | పూర్వ వీఆర్ఏ, వీఆర్ఓలకు జీపీవోలుగా అవకాశమివ్వాలి

- అర్హతలతో నియామకాలు అడ్డుకోవద్దు
- తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్
- అధికారులకు వినతిపత్రం అందజేత
VRA, VRO | రెవెన్యూ శాఖలో పనిచేసి, అపార అనుభవం కలిగిన పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలకు అర్హతలతో సంబంధం లేకుండా గ్రామ పాలన అధికారులుగా (జీపీవో) అవకాశం కల్పించాలని తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) కోరింది. టీజీఆర్ఎస్ఏ గౌరవ అధ్యక్షుడు వీ లచ్చిరెడ్డి సమక్షంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి వీ భిక్షం.. అధికారులను కలిసి జీపీవోల నియామకంపై వినతిపత్రం అందజేశారు.
రెవెన్యూ విభాగంలో నేరుగా వీఆర్ఏలుగా నియామకమై 2018-19లలో వీఆర్ఓలుగా సుమారు 250 మంది పదోన్నతి పొందినట్టుగా ఆ వినతిపత్రలో గుర్తు చేశారు. వీరంతా ప్రస్తుతం వివిధ విభాగాలలో సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. వీరంతా మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ జీపీవోల నియామకానికి సంబంధించిన జీవోలో కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నారు. ఐదేళ్లు సర్వీసు అనే నిబంధన వీరికి తీవ్ర ఆటంకంగా మారిందని తెలిపారు.
చాలా మంది వీర్వోవోలు పదో తరగతి విద్యార్హతతో అనేక సంవత్సరాల సేవలు అందించారని వారు తెలిపారు. రెవెన్యూ శాఖలో వారి అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి వారికి రెవెన్యూ శాఖలో జీపీవోలుగా అవకాశం కల్పించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ) పోస్టులను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కు ఇచ్చారన్నారు. నాడు కనీస విద్య అర్హత పదో తరగతిగానే ఉందన్నారు. నిబంధనలకు లోబడి వారిని స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావడానికి అవకాశం ఇవ్వాలన్నారు.
పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలలో చాలా మంది ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల వరకు విద్యార్హతలను కలిగి ఉన్నారని గుర్తు చేశారు. గతంలో వారు రెవెన్యూ శాఖలో కొనసాగిన సమయంలో విధుల్లో సమగ్ర అనుభవాన్ని కలిగి ఉన్నారన్నారు. భూ పరిపాలనతో వారికి పరిచయం ఉండటం వలన వారికి జీపీఓలుగా అవకాశం కల్పిస్తే అంకితభావంతో పని చేస్తూ ముఖ్యంగా భూ భారతి చట్టం వచ్చిన నేపథ్యంలో వారు సమర్ధవంతంగా పని చేస్తారన్నారు.
చాలా మంది పూర్వ వీఆర్ఏ, వీఆర్ఓలు జీపీఓ పోస్టులకు వివిధ సాంకేతిక కారణాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయారన్నారు. ఇలాంటి కేసులను జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఐదు సంవత్సరాల సర్వీసు లేనప్పటికీ ఇతరత్రా అర్హత కలిగి ఉన్నవారందరికీ, పూర్వ వీఆర్ఓలకు జీపీఓలు చేసేందుకు కనీస విద్యార్హత పదో తరగతి చేయాలని కోరారు. టీజీఆర్ఎస్ఏ వినతిపత్రంలో పేర్కొన్న అన్ని రకాల అంశాల పట్ల అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు. అతి త్వరలోనే అధికారంగా ప్రకటన రానున్నట్టుగా తెలిపారు.