bandi sanjay: కవిత లేఖ ఓటీటీ డ్రామాలా ఉంది

– బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు
– దోషులని తేలితే జైలుకే.. బీజేపీ ప్రమేయం ఉండదు
– ఎక్స్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పోస్ట్
bandi sanjay: ప్రస్తుతం రాష్ట్రంలో కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది. తాజాగా ఈ లేఖకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కవిత రాసిన లేఖ ఓటీటీ డ్రామాలా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉందని.. కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీని బద్నాం చేసేందకు కాంగ్రెస్, బీఆర్ ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆయన వాపోయారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ రెండు కుటుంబపార్టీలేనని ఆరోపించారు.
గాంధీ కుటుంబమైనా.. కల్వకుంట్ల కుటుంబమైనా తమకు తేడా లేదని పేర్కొన్నారు. వారి కుటుంబగొడవలను ప్రజల మీదకు ఎందుకు రుద్దుతున్నారంటూ మండిపడ్డారు. కవితను లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడంపై స్పందిస్తూ.. చట్టం ముందు దోషులని తేలితే ఎంతటివారైనా అరెస్ట్ కాకతప్పదని స్పష్టం చేశారు.
కవిత లేఖ వ్యవహారంపై బీఆర్ ఎస్ ముఖ్యనేతలు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు ఈ లేఖ కాంగ్రెస్ పార్టీ సృష్టి అంటూ బీఆర్ ఎస్ సోషల్ మీడియా ఆరోపిస్తున్నది. కవిత సంతకం లేఖలో సరిపోలడం లేదని వాళ్లు పోస్టులు పెడుతున్నారు. కవిత, హరీశ్ రావు, కేటీఆర్ ఇంకా ఈ లేఖపై మాట్లాడలేదు. కవిత మీడియా ముందుకు వస్తే ఈ లేఖకు సంబంధించి మరిన్ని అంశాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. ఇక కవిత లేఖ అనంతరం ఆమె పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది.