Kalvakuntla Family | కల్వకుంట్ల ఫ్యామిలీ చలో అమెరికా! ఏంటీ విషయం?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు వరుసబెట్టి అమెరికా పర్యటనలకు వెళుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. సొంత పనుల మీద వెళుతున్నారని బీఆరెస్ నేతలు చెబుతున్నా.. అందులో వేరే రహస్యాలు ఉన్నాయని కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఊదరగొడుతున్నాయి.

Kalvakuntla Family | రాజకీయాలే జీవన శైలిగా మార్చుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం ఉన్నట్టుండి తెలంగాణ రాజకీయాలకు తాత్కాలిక బ్రేక్ అన్నట్లుగా ఒకరివెంట ఒకరు అమెరికా బాట పట్టనుండటం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నార్త్ కరోలినాకు శుక్రవారం పయనమయ్యారు. తన కుమారుడి చదువుకు సంబంధించి స్నాతకోత్సవం నిమిత్తం కవిత నార్త్ కరోలినా వెళుతున్నారు. దీనికోసం ఆమె ఇప్పటికే సీబీఐ కోర్టు నుంచి షరతులతో కూడిన ప్రత్యేక అనుమతి కూడా పొందారని సమాచారం. తిరిగి కవిత ఈ నెల 22న స్వదేశానికి రానున్నారు.
రజతోత్సవ సభ పేరిట..కేటీఆర్
అమెరికా నుంచి కవిత తిరిగి వచ్చిన వెంటనే కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా వెళ్లబోతున్నారు. ఈ నెల 26న డల్లాస్‌లో జరిగే పార్టీ రజతోత్సవ సభకు ఆయన హాజరవుతారు. ఇకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఇప్పటికే అమెరికా పర్యటన కోసం తన పాస్‌పోర్ట్ రెన్యూవల్ కూడా చేయించుకున్నారు. అయితే కేసీఆర్ ఎప్పుడు అమెరికా వెళతారన్నదానిపై స్పష్టత లేదు. ఈ నెలాఖరులో కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లే చాన్స్ ఉందంటున్నారు. కొన్ని నెలల క్రితం హరీశ్ రావు కూడా అమెరికా వెళ్లారు.
యాదృచ్చికమా? వ్యూహామా?
కేసీఆర్ కుటుంబ సభ్యులు వరుసగా అమెరికా పర్యటనకు వెళ్లడం యాదృచ్చికమేనా? లేక ఏదైనా ప్లాన్ ఉందా? అన్న సందేహాలు జోరుగా వినిపిస్తున్నాయి. బయటకు చెప్పిన కారణాలు ఏవైనప్పటికీ లోగుట్టు వేరే ఉందంటూ అధికార కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఊదరగొడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రభాకర్ రావును కలవడానికి కేసీఆర్, కేటీఆర్ వెళ్లబోతున్నారని, అంతకుముందు హరీశ్‌రావు కూడా ఇదే పనిమీద వెళ్లివచ్చారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పటికే.. బీఆర్ఎస్ లో తనపై కుట్రలు చేస్తున్నారంటూ కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారనే వార్తలు వచ్చాయి. అవసరమైతే భవిష్యత్తులో కొత్త పార్టీ పెట్టేందుకు కావాల్సిన ఫండింగ్ సమకూర్చుకోవడం కోసం కవిత అమెరికా వెళుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. కేటీఆర్ ఎప్పటిలాగే రిలాక్స్ అవ్వడానికి అమెరికా బాట పట్టారని కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియా వర్గాలు కథనాలు వడ్డిస్తున్నాయి. వరుస బెట్టి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అమెరికా బాట పడుతుండటంతో ఈ పరిణామాల వెనుక మతలబు ఏమిటన్నదీ హాట్ టాపిక్ గా మారింది.