Bird Flu: హైద‌రాబాద్ స‌రిహ‌ద్దుల్లో.. బర్డ్ ఫ్లూ విస్తరణ! రెడ్ జోన్‌గా ప్ర‌క‌టన‌! 2లక్షలకు పైగా కోళ్లు..

  • By: sr    news    Mar 22, 2025 4:36 PM IST
Bird Flu: హైద‌రాబాద్ స‌రిహ‌ద్దుల్లో.. బర్డ్ ఫ్లూ విస్తరణ! రెడ్ జోన్‌గా ప్ర‌క‌టన‌! 2లక్షలకు పైగా కోళ్లు..

Bird Flu | Hyderabad | Nalgonda

విధాత: తెలుగు రాష్ట్రాలను వణికించిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు హైద‌రాబాద్ స‌రిహ‌ద్దుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో విస్తరిస్తూ కోళ్ల పెంపకందారులను తీవ్ర నష్టాల పాలు చేస్తుంది. నెల రోజుల క్రితం చౌటుప్పల్ మండలం నేలపట్లలో తెలంగాణలోనే తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం, దోతిగూడెం పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కేసు నమోదవ్వడం కలకలం రేపింది. దీంతో అధికారులు ఫామ్ లో ఉన్న 52 వేల కోళ్లను చంపి పాతిపెట్టారు. పరిసర ప్రాంతాలను రెడ్ జోన్ ప్రకటించారు కోళ్ల షెడ్ లను క్లీనింగ్ చేయించారు.

ఈ నెల12వ తేదీన దోతిగూడెం గ్రామంలోని పిట్ట సుదర్శన్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్‌లో 500 కోళ్లు మృతి చెందాయి. ఆ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు పశువైద్యాధికారులు చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలను సేకరించారు. వాటిని మధ్యప్రదేశ్, భోపాల్‌లోని హై సెక్యూరిటీ వీబీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ వీటిని పరీక్షించగా.. వాటికి బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణ అయింది. అటు చిట్యాల మండలం, గుండ్రాంపల్లి గ్రామంలో కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ సోకడంతో అధికారులు సుమారు 2 లక్షల కోళ్లను భూమిలో పాతి పెట్టించారు. చుట్టుపక్కల ప్రాంతాలను “రెడ్ జోన్” గా ప్రకటించారు.

నెల రోజుల క్రితం వరకు తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ బారిన పడి లక్షల కోళ్లు చనిపోయాయి. దీంతో కోళ్ల పెంపకందారులతో పాటు చికెన్ వ్యాపారులు కూడా నష్టపోయారు. ప్రజలు చికెన్ తినేందుకు జంకడంతో చికెన్ రేట్లు కూడా భారీగా పడిపోయాయి. అయినా ప్రజలు చికెన్, ఎగ్స్ తినడమే మానేశారు. కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టడంతో మెల్తగా మళ్లీ చికెన్ అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఈ సమయంలో మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు వెలుగు చూడటంతో మరోసారి చికెన్ ప్రియులు చికెన్, కోడిగుడ్లు తినాలంటే భయపడే పరిస్థితి వచ్చింది.