KTR: రేవంత్.. నీ ఎఫైర్స్ బయటపెట్టాలా? రోజూ.. ఉద‌యం సెల్ఫ్ డ్రైవింగ్‌తో అక్క‌డ‌కు

  • By: sr    news    Mar 17, 2025 2:22 PM IST
KTR: రేవంత్.. నీ ఎఫైర్స్ బయటపెట్టాలా? రోజూ.. ఉద‌యం సెల్ఫ్ డ్రైవింగ్‌తో అక్క‌డ‌కు

KTR | Revanth Reddy

విధాత: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ మీడియాతో చేసిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎఫైర్స్ ఏమిటో బయట పెట్టాలా అని.. ఆయన ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసని.. ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయ 5గంలకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడని ఆరోపించారు.

పదేళ్ళు అధికారంలోకి ఉన్న మాకు ఎవరు ఎంటో అన్నీ తెలుసన్నారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయన్నారు. నామీద 15 కేసులు పెట్టిన రేవంత్ రెడ్డికి ప్రజాసామ్య విలువలు ఈ రోజు గుర్తుకు వచ్చాయా అని, రేవంత్‌కు ఈ రోజు కుటుంబం గుర్తుకు వచ్చిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మాపై దారుణమైన, అసహ్యకరమైన అరోపణలు, మాటలు మాట్లాడినప్పుడు మాకు కుటుంబాలు లేవా? అని నిలదీశారు. మాకు అడ్డమైన వాళ్లతో సంబంధాలు అంటగట్టినప్పుడు, మా పిల్లల్ని రాజకీయాల్లోకి లాగిన రోజు మీకు విలువలు లేవా? అంటూ ధ్వజమెత్తారు.

సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని, అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారో సీఎం రేవంత్ చెప్పాలన్నారు.  రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నాడని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని సవాల్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

ఆదాయం తగ్గిందని సీఎం ఒప్పుకున్నారు

70 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని సీఎం ఒప్పుకున్నారని..తెలంగాణ రైజింగ్ అంటూనే ఈ తగ్గింపు ఏమిటి? ఇది ముమ్మాటికి తెలంగాణ ఫాలింగ్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇంతకంటే రాష్ట్రానికి ఘోరమైన అవమానం ఇంకోటి ఉండదన్నారు. తెలంగాణలో వ్యవసాయం, పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పగా చెప్తుంటే మరి అదాయం ఏట్లా తగ్గిందని కేటీఆర్ ప్రశ్నించారు? బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పజెప్పితే, కాన్సర్ అంటూ మాట్లాడి రేవంత్ సర్వనాశనం చేశాడన్నారు. ఏఏ రంగాల్లో వృద్ధి పెరిగిందో బడ్జెట్‌లో చెప్పాలని.. దానితో వచ్చే అదాయం పెరిగిన తీరు చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కంటే ముందే నేరాన్ని అంగీకరించి అప్రూవర్‌గా రేవంత్ మారారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పూర్తి అట్టర్‌ఫ్లాప్ అని సీఎం స్వయంగా ఒప్పుకున్నారన్నారు.

ఎవరైనా ముఖ్యమంత్రి ఇండ్లు కడతారు.. కానీ, కూలగొడతారా? అని, అందుకే రియల్ ఎస్టేట్ ఢమాలైందన్నారు. ఆదాయం పెంచే తెలివి ఈ ప్రభుత్వానికి అస్సలు లేదన్నారు. గాల్లో మెడలు కట్టడం లేదని, వాస్తవిక బడ్జెట్ పెడ్తున్నామని భట్టి విక్రమార్క గొప్పగా చెప్పారని, ఇన్నాళ్లు మేము చెప్పిందే నిజమైందని ఒప్పుకున్నారని కేటీఆర్ చురకలేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి సీఎం విధానాలే కారణమని ఆరోపించారు. కేసీఆర్ మీద ఉన్న కోపంతో, పంటలు ఎండబెట్టడంతో ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం నుంచి కాంట్రిబ్యూషన్ తగ్గిందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పట్టణాలు, గ్రామాల్లో దిగజారడానికి కారణం పూర్తిగా రేవంత్ రెడ్డి మాత్రమేనని విమర్శించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పినప్పుడు వినలేదని.. బడ్జెట్ కోతతోనే అదే నిజమైందన్నారు.

కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చినావో చెప్పు?

రేవంత్ ఏడాది కాలంగా చేసిందంతా నెగటివ్ పాలిటిక్స్ అని.. అక్రమ నిర్బంధాలు, తెలంగాణను కాన్సర్ అంటూ రాష్ట్ర పరువు తగ్గించడం వంటి అడ్డమైన మాటల వల్లనే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. రేవంత్ వంటి పిచ్చోడి చేతిలో తెలంగాణ రాయి అయిపోయిందన్నారు. ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలోనే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండు అనదానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మొదటి సంవత్సరం పరీక్షలో ముఖ్యమంత్రి దారుణంగా విఫలమయ్యాడని.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందన్నారు. ఎలాంటి ఆర్ధిక మాంద్యం లేకుండానే, కోవిడ్ వంటి సంక్షోభం లేకుండానే ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రంతో మంచిగా ఉన్నానని చెప్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అదనంగా తెచ్చింది ఏమిటని? ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల వలన కేంద్రం నుంచి తీసుకొచ్చి నిధులు, చేసిన లాభం ఏమిటని ? కేటీఆర్ నిలదీశారు. ఢిల్లీకి 40 సార్లు కాకపోతే 400 సార్లు పోయి ప్రధానమంత్రి మోడీ, రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకో, మాకేం సమస్య లేదు, కానీ తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చినావో చెప్పు? అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంతో సఖ్యతతో ఉండి సాధిస్తామని అన్నారని.. ఏం సాధించారో?  చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలు విచక్షణతో ఆలోచించి రెండుసార్లు మాకు అవకాశం ఇచ్చినారని., కాబట్టి తెలంగాణ బలంగా నిలబడిందన్నారు.

రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రితో సమైక్యాంధ్ర పాలకులు అన్న మాటలు నిజమవుతున్నాయని విమర్శించారు. తెలంగాణకి నాయకత్వ లక్షణాలు లేవు, చేతకాదు, పరిపాలన చేయడం రాదన్న ఆరోపణల్ని తన పాలనతో రేవంత్ రెడ్డి నిజమే అని నిరూపిస్తున్నట్టు కనిపిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి 2014లో గనుక ఉండుంటే తెలంగాణ విఫల రాష్ట్రంగా మిగిలిపోయేదని వ్యాఖ్యానించారు. సీఎం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బట్టలు విప్పి అసెంబ్లీలో నిలబెట్టాడన్నారు.

ఓవర్సీస్ స్కాలర్‌షిప్పులకు సంబంధించి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని అసెంబ్లీలో ఎండగడుతామని తెలిపారు. ఏడు వేల మందికి పైగా విద్యార్థులు, తెలంగాణ బిడ్డలు విదేశాలకు చదవుకోవడానికి వెళ్లి బాగా ఇబ్బంది పడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డికి గాసిప్స్ మీద తప్ప గవర్నెన్స్ మీద దృష్టి లేదు.. రేవంత్ ముఠా టీడీఆర్ స్కాం చేయబోతున్నదని.. రేవంత్ టీడీఅర్ పైన మాట్లాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రాష్ట్రం అప్పులపాలైందని చెప్పి, అందాల పోటీలా?

రాష్ట్రం అప్పులపాలైందని చెప్పి, అందాల పోటీలు పెడతారట అని.. అందాల పోటీలు పెట్టి రేవంత్ ఏం సాధించాలనుకుంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుంది అందాల పోటీ కథ అని ఎద్దేవా చేశారు. 46 కోట్లతో ఫార్ములా ఈ రేసు పెట్టి రాష్ట్రానికి ఏం తెస్తామో చెప్పినా వినకుండా అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇవాళ 250 కోట్లతో అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారన్నారు. ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్న రాష్ట్రంలో అందాల పోటీలు సిగ్గుచేటని, దీనిపై రేవంత్ జవాబు చెప్పాలి, కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. అందాల పోటీలతో ఊరూరికీ బ్యూటీ పార్లర్ పెడతావా? అని..ఇప్పుడు అందాల పోటీలకు అంత ప్రాధాన్యత లేదని కేటీఆర్ వెల్లడించారు. కరెంట్ కోతలు, తీవ్ర వ్యవసాయ సంక్షోభంలో రాష్ట్రం చిక్కుకుంటే, ప్రభుత్వం ఫోకస్ మొత్తం అందాల పోటీల మీద ఉందన్నారు.  ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కావడం లేదని, ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని మోసం చేశారని దుయ్యబట్టారు.

మేమొచ్చాకా ఫార్ములా ఈ రేసు రద్ధు నష్టంపై విచారణ
ఫార్ములా ఈ రేసు వల్ల వచ్చిన లాభం నేను చెప్పానని, ఫార్ములా ఈ రేసుతో ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేసుకుని 46 కోట్లు పోవడానికి రేవంత్ కారణం అయ్యాడని కేటీఆర్ విమర్శించారు. ఒప్పందం రద్దు చేసుకుంటే డబ్బులు పోతాయని తెలిసినా, రేవంత్ కావాలనే రద్దు చేశాడని.. ప్రజల డబ్బులు పోయేలా చేశాడన్నారు. ఈ ఒప్పందం రద్దు చేయడంతో జరిగిన ప్రజల సొమ్ము నష్టంపై ప్రభుత్వంలోకి రాగానే విచారణ జరుపుతామన్నారు. తెలంగాణ జాతిపిత లాంటి కేసీఆర్ పై చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నది అభినవ గాడ్సె రేవంత్ రెడ్డి అన్నారు. మన జాతిపిత గాంధీని చంపింది గాడ్సె అని, రేవంత్ వి గాడ్సె మూలాలే అని కేటీఆర్ ఆరోపించారు.