Monalisa: హల్‌చల్ చేస్తున్న చోటీ మోనాలిసా

మోనాలిసా (Monalisa) అంటే ఎవరో తెలుసా? అంటే అందరూ లియోనార్డో డావించీ పేయింటింగ్ గురించి చెప్పరు.. ఇటీవల ముగిసిన మహాకుంభమేళాలో వైరల్‌గా మారిన రుద్రాక్ష పూసలమ్మే అమ్మాయిని ప్రస్తావిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో ఆమె వీడియో వైరల్‌గా మారి.. రాత్రికి రాత్రే ఆమెను సెలబ్రిటీగా మార్చేసింది. నిరుపేదరాలైన మోనాలిసా భోంస్లే.. ఇప్పుడు స్టార్ స్టేటస్‌కు దగ్గరగా వెళ్లిపోయింది. వీఐపీగా మారింది. ఇప్పుడు ఇంకో మోనాలిసా (Monalisa) నెట్టింట హల్‌చల్ చేస్తున్నది. కాకపోతే.. చోటీ మోనాలిసా! ప్రయాగ్‌రాజ్ మోనాలిసా నీలి కళ్ల మాదిరిగానే ఈ చిన్నారి కళ్లు, శరీర ఛాయ కూడా ఆమెను గుర్తుకు తెచ్చేలా ఉండటంతో ఆ వీడియో సైతం నెట్టింట వైరల్‌గా మారింది. చోటీ మోనాలిసాగా ప్రఖ్యాతి పొందుతున్నది. మోనాలిసాను అచ్చం పోలినట్టు ఉన్న చోటీ మోనాలిసాను ఉజ్జయని (Ujjain)లో గుర్తించారు.
కంటెంట్ క్రియేటర్ మనోజ్ వైష్ణవ్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రారంభంలో ఉజ్జయినిలోని ఒక ఆలయం వద్ద ముగ్గురు బాలికలు నిలబడి ఉండటంతో ఈ వీడియో మొదలవుతుంది. వాళ్లు చేతిలో పసుపు, కుంకుమ ఉన్న చిన్న గిన్నెలు పట్టుకుని నిలబడి ఉంటారు. ఆ ఆలయానికి వచ్చే భక్తుల నుదుట తిలకం దిద్ది వాళ్లిచ్చే ఐదో పదో తీసుకుంటుంటారు. ఈ రీల్‌ను రూపొందించిన క్రియేటర్.. ఆ ముగ్గురు బాలికల పేర్లు అడుగుతాడు. వారిలో ఒక అమ్మాయి కెమెరా ముందుకు వచ్చి, తన పేరు కాజల్ అని చెబుతుంది. తర్వాత కెమెరా చోటీ మోనాలిసా వైపు తిరుగుతుంది. మోనాలిసా భోంస్లే చిన్నప్పుడు అచ్చం ఇలానే ఉండేదేమో అనిపించేలా ఒక బాలిక కనిపిస్తుంది. ఆమె విశాలమైన కళ్లు, అకట్టుకునే ముఖ కవళికలు, ముక్కు పుడక, నుదుటన గుండ్రటి బొట్టు.. అన్నీ రుద్రాక్షల పిల్ల మోనాలిసానే తలపిస్తున్నాయి. కంటెంట్ క్రియేటర్ ఆమెను చోటీ మోనాలిసాగా పిలిచాడంటే నిజమే అనిపిస్తుంది.
‘ఇదిగో చిన్న మోనాలిసా..’ అంటూ ప్రయాగ్‌రాజ్ మోనాలిసాతో తిలకం దిద్దే బాలికను అతడు పోల్చాడు. మొదట్లో ఆ బాలిక సిగ్గుతో చిరు నవ్వు నవ్వుతుంది. వెంటనే ఆమె ముఖ కవళికలు నాటకీయంగా మారిపోతాయి. ఏమనుకుందో ఏమోగానీ.. ఆ కెమెరామెన్‌పై తీవ్రంగా స్పందించిన ఆ బాలిక.. కోపంగా చూస్తూ.. ‘తేరా మొబైల్ ఫాడ్ దాలూంగీ (నీ మొబైల్ ఫోన్‌ను పగలగొడతా) అంటూ హెచ్చరించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో కింద కామెంట్లు పెట్టిన అనేక మంది సైతం అచ్చం ప్రయాగ్‌రాజ్ మోనాలిసాలనే ఉందని రాశారు. మార్చి 11న ఆన్‌లైన్‌లోకి వచ్చిన ఈ వీడియో.. రెండు లక్షలకు పైగా లైక్స్ సాధించింది.