దోపిడీ చేశారనే ప్రజలు బీఆర్ఎస్‌ను పక్కనబెట్టారు: సీఎం రేవంత్
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకం పనుల పునరుద్థరణలో భాగంగా ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్న ‘మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే’ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
హైదరాబాద్, నవంబర్ 03(విధాత): ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకం పనుల పునరుద్థరణలో భాగంగా ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్న ‘మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే’ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం ప్రసంగించారు. 30 టీఎంసీల తరలింపు, 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 1983 లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మంజూరైందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి టన్నెల్-1, టన్నెల్-2 పనులను ప్రారంభించారు.
రూ. 1968 కోట్లతో టెండర్లు ఇచ్చారు. టన్నెల్ బోర్ మిషన్ తో దేశంలోనే తొలిసారి ఎస్ఎల్బీసీ టన్నెల్ కు ఉపయోగించారని సీఎం తెలిపారు. 2014 వరకు కి.మీ టన్నెల్ పనులు పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత పదేళ్లలో పది కి.మీ కూడా కేసీఆర్ పూర్తిచేయలేదని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో హరీష్, కేసీఆర్ ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్మీలో ఉన్న పరిచయాలతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు, తప్పులు చేసి అప్పులు చేసి దోపిడీ చేశారనే ప్రజలు మిమ్మల్ని పక్కనబెట్టారని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఇక్కడి ప్రజలు మమ్మల్ని క్షమించరని, ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముంపునకు గురవుతున్న మర్లపాడు, కేశ్య తండా, నక్కలగండి తండా ప్రజలను ఆదుకుని, డిసెంబర్ 31 లోగా సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని సీఎం భరోసా ఇచ్చారు. ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్టును ఇంకెప్పుడూ పూర్తి చేసుకోలేం, ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగొంచుకుని ప్రాజెక్టు పూర్తి చేసుకుందామని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోకపోతే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలకు నష్టం కలుగుతుందని సీఎం వెల్లడించారు.
ఇంత తక్కువ ఖర్చుతో 30 టీఎంసీలు తీసుకు వెళ్లే ప్రాజెక్టు ఎక్కడా లేదు, మేం అధికారంలోకి వచ్చాక పనులు మొదలు పెట్టాం. దురదృష్టవశాత్తు 8 మంది కార్మికులు చనిపోయారు. మాకు బాధ ఉన్నా.. ఆ కుటుంబాలను ఆదుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నంచేస్తున్నామని సీఎం అన్నారు. గ్రావిటీ ద్వారా నల్గొండకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో 40 కి.మీ టన్నెల్ ఎక్కడా లేదు, ఇది పూర్తయితే తెలంగాణకు ఆ రికార్డు దక్కుతుందని పేర్కొన్నారు. ఆనాడు 2 వేల కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడు పెరిగిన అంచనాలతో 4600 కోట్లతో ఈ టన్నెల్‌ను పూర్తి చేయవచ్చని వెల్లడించారు.
ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమే కాదు.. కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేయలేదన్నారు. కేసీఆర్ పదేళ్లలో 1 లక్షా 86 వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు, అందులో 1 లక్షా 5 వేల కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేశారని విమర్శించారు. కృష్ణాలో మన వాటా మనం తీసుకోకపోవడం వల్ల ఆ నీటిని ఆంధ్రా తరలించుకు పోతోందని అన్నారు. 299 టీఎంసీలు చాలు అని ఆనాడు హరీష్ సంతకం పెట్టి వచ్చారని, మన వాటా మనకు దక్కాల్సిందేనని ట్రిబ్యునల్ లో దీనిపై మేం వాదనలు వినిపిస్తూ ఒక కొలిక్కి తీసుకొస్తున్నామని సీఎం రేంత్ రెడ్డి తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram