Mallu Bhatti Vikramarka | రైతు భరోసాపై భట్టి కీలక వ్యాఖ్యలు.. మంగళవారం రైతు సంబరాలు

Mallu Bhatti Vikramarka | రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం చెప్పినట్లుగానే 9 రోజుల్లో రూ. 9కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటి వరకు 1కోటి 49లక్షల 39వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎకరాకు రూ.12వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించినట్లు తెలిపారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ కో ఆర్డినేటర్ల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కింద నిధులను రైతుల ఖాతాల్లో ఈ నెల 16 నుంచి జమ చేస్తున్నామని.. ఇది జూన్ 24తో పూర్తవుతుందని భట్టి వివరించారు.
నేడు రైతు సంబరాలు
రైతు భరోసా పంపిణీ పూర్తవ్వనన్న సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. సచివాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు నేస్తం సదస్సు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ప్రజాప్రభుత్వం రైతులకు 2లక్షల రుణమాఫీ చేసిందని..ఉచిత విద్యుత్తు అందిస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్, 200యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, పేదలకు సన్న బియ్యం అందిస్తుందని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసం నిత్యం శ్రమిస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలపరుచాలని కోరారు.