- శాంతిచర్చల కమిటీతో మావోయిస్టు మాజీ నేతల భేటీ!
- వర్తమాన ప్రధాన అంశాల పై ఇరువర్గాల మధ్య చర్చలు
- పాల్గొన్న చంద్రకుమార్, దేవ్ జీ, సంగ్రామ్ తదితరులు
విధాత, ప్రత్యేక ప్రతినిధి : దేశ వర్తమాన సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య పరిస్థితుల పై మావోయిస్టు పార్టీ మాజీ అగ్ర నేతలు శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో స్నేహపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా వర్తమాన అంశాలపై ప్రజాస్వామ్య కోణంలో కీలక చర్చలు జరిగాయి. భవిష్యత్ ప్రజాస్వామ్య ఉద్యమాలు, – శాంతి కమిటీ ఆవశ్యకత, రాజ్యాంగ రక్షణ, సెక్యులరిజం దేశస్వావలంబన ఆదివాసీల సమస్యల పై చర్చ సాగింది. హైదరాబాద్‌లోని జస్టిస్ చంద్రకుమార్ కార్యాలయంలో శుక్రవారం ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ఈ భేటీలో మాజీ మావోయిస్టు నేతలు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ , మళ్ళా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, సుజాతక్క, జెఎన్ఎం నేత సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రస్తుత దేశ సామాజిక, రాజకీయ పరిస్థితుల పై చర్చంచారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య ఉద్యమాల ఆవశ్యకతపై ఇరువర్గాల మధ్య చర్చసాగింది. గత ఏడాది మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ నేపథ్యంలో జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో ఈ శాంతి చర్చల కమిటీ ( పీస్ డైలాగ్ కమిటీ) ఏర్పాటైన విషయం తెలిసిందే. వామపక్ష పార్టీలు, ఎం.ఎల్. పార్టీలు, వివిధ ప్రజాస్వామ్య శక్తులు కేంద్రం, మావోయిస్టుల మధ్య కాల్పుల విరమణ కోసం నిరంతరం ఉద్యమించారు. శాంతియుత వాతావరణం కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో మావోయిస్టు పార్టీ మాజీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాల పై చర్చ సాగింది.
దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి, ప్రజల గొంతుకను వినిపించడానికి భవిష్యత్తులో రాబోయే ప్రజాస్వామ్య ఉద్యమాలలో శాంతి కమిటీల పాత్ర ఎంతో కీలకమని, ఈ కమిటీల పరిధిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. రాజ్యాంగ రక్షణ (Constitutional Security) పై చర్చ సాగింది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటమే ప్రజాస్వామ్య శక్తుల ప్రథమ కర్తవ్యమని పునరుద్ఘాటించారు. సెక్యులరిజం (లౌకికవాదం) పరిరక్షణ అత్యంత అవసరమని భావించారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసే శక్తులకు వ్యతిరేకంగా, లౌకికవాద విలువలను కాపాడుకుంటూ, అన్ని వర్గాల ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించే దిశగా ప్రజాస్వామ్య ప్రోగ్రామ్‌లను రూపొందించాలని చర్చించారు. దేశ స్వావలంబన – ఆర్థిక హక్కులు కూడా ఇద్దరి మధ్య చర్చల్లో అంశంగా మారింది. దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీసే కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ, స్వదేశీ వనరులు, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే దేశం నిజమైన ప్రగతి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆదివాసీల విస్థాపన సమస్య చర్చలో మరో అంశంగా మాట్లాడుకున్నారు. అభివృద్ధి పేరుతో అడవుల నుండి ఆదివాసీలను బలవంతంగా విస్థాపన చేయడాన్ని కమిటీ తీవ్రంగా ఖండించింది. జల్ జంగిల్ -జమీన్ పై ఆదివాసీలకు ఉన్న హక్కులను కాపాడాలని, వారి సంస్కృతిని, ఉనికిని రక్షించడానికి ప్రత్యేక కార్యాచరణ అవసరమని సూచించారు. నిరుద్యోగ సమస్య మరియు యువత ఆవేదన అంశానికి ప్రాధాన్యతనిచ్చారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. దీనికి తాజాగా జరిగిన నీట్ (NEET) పేపర్ లీకేజీ ఉదంతాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇది లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు, వారి కుటుంబాల ఆశలతో ఆడుకోవడమేనని, ఈ విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీస్ డైలాగ్ కమిటీ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ , సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు కందిమళ్ళ ప్రతాప్ రెడ్డి, ప్రొఫెసర్ అన్వర్, సీనియర్ ఎడిటర్ రహమాన్, అడ్వకేట్ వెంకన్న, ఖాన్, ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్, సోమా రామమూర్తి, జై సింగ్ రాథోడ్, అజయ్ బాల్నే, పీడీసీ కో-ఆర్డినేటర్ బండి దుర్గాప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ మావోయిస్టు మాజీ అగ్రనేతలు కొద్ది రోజుల క్రితం సీపీఐ ముఖ్యనేతలతో కూడా చర్చించిన విషయం తెలిసిందే.
