Nag Ashwin: మన ‘ఖర్మ’.. సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మొద్దు

Nag Ashwin:
విధాత: ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం వివాదంపై స్పందించారు. యూనివర్సిటీ భూములు అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల నాగ్ అశ్వీన్ తన ఇంస్టాగ్రామ్ లో “మన ఖర్మ” అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఎవడే సుబ్రమణ్యం సినిమా రిలీజ్ జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో విలేఖరులు దీనిపై అడిగిన ప్రశ్నలకు నాగ్ అశ్విన్ స్పందించారు. యూనివర్సిటీ భూములు 400ఎకరాలు ఆ ప్రాంతంలో గ్రీన్ ఏరియాగా ఉందని.. పచ్చదనం జీవ వైవిధ్యం కోణంలో ఆ భూముల్లో చెట్లు కొట్టకుండా ఉంటే మంచిదన్నారు. ఈ భూముల బదులుగా ఐటీ పార్కులో ఇంకా చాల భూములున్నాయని.. ఇతర చోట్ల కూడా భూములున్నాయని వాటిని ప్రభుత్వం అభివృద్ధికి పరిగణలోకి తీసుకోవచ్చన్నారు. నాకు మాత్రం పూర్తిగా అవగాహాన లేదని.. అయితే ఆ 400ఎకరాలలో చెట్లు తొలగించకుంటే మంచిదని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
సెంట్రల్ యూనివర్సిటీ 400ఎకరాల భూముల అమ్మకంపై విద్యార్ధి జేఏసీ పోరాడుతుంది. సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం 1974లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీకి మొదట 2300 ఎకరాలు కేటాయించారని… 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు. తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించారని ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమేనని విద్యార్ధి జేఏసీ మండిపడుతోంది. మరోవైపు ఈ స్థలం హెచ్ సీ యూకి చెందినదే కాదని, కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ 400 ఎకరాల భూముల విక్రయం ద్వారా రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
అగని హెచ్ సీయూ భూముల అన్యాక్రాంతం
హెచ్ సీయూ 2,300 ఎకరాలలో ఇప్పటికే టీఐఎఫ్ఆర్ కు 200 ఎకరాలు, ఐఎస్ బీకి 260, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల కోసం 200 ఎకరాలు, ఎఐఏబీకి 100ఎకరాలు, నిడ్ కు 30, హెచ్ సీయూ ఆర్టీసీ డిపోకు 9 ఎకరాలు, ట్రిపుల్ ఐటీకి 60 ఎకరాలను కేటాయించారు. విద్యుత్ సబ్ స్టేషన్, గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ విద్యుత్ కేంద్రం, ఎంఆర్ఓ కార్యాలయాలకు, జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్, సర్కిల్ కార్యాలయాలకు, టిమ్స్ ఆస్పత్రికి దాదాపు 100 ఎకరాలు కేటాయించారు. ఇటీవలే టీఎన్ జీవో కాలనీకి ఐఎస్ బీ ప్రహరీని ఆనుకొని లింకు రోడ్డుకు 20 ఎకరాలు కూడా హెచ్ సీయూ నుంచి తీసుకుని రోడ్డు నిర్మించారని విద్యార్ధి జేఏసీ వెల్లడించింది.