EC: సీసీటీవీ ఫుటేజ్.. బయటపట్టలేం

న్యూఢిల్లీ: పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజ్ బహిరంగ పర్చాలన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. రాహుల్ డిమాండ్ సరైందికాదని పేర్కొన్నది. ఓటర్ల గోప్యత, వారి భద్రతా సమస్యలకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950/1951నికి ఇది విరుద్ధమని తెలిపింది. పోలింగ్ సమయంలోని వీడియో ఫుటేజ్‌బయట పెట్టడం ప్రజాప్రతినిధుల చట్టం ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొంది. పైగా ఓటు వేయడం, ఓటు వేయకపోవడం వ్యక్తిగత హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని ఈసీ పేర్కొంది.
సదరు వీడియోలు అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమేనని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రమే వాటిని పంచుతామని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా కోర్టులో ఎలాంటి పిటిషన్లు దాఖలు కానిపక్షంలో ఆ తర్వాత వాటిని తొలగించడం సాధారణ ప్రక్రియ అని స్ఫష్టం చేసింది. నిర్దిష్ట రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్ట బూత్‌లో తక్కువ ఓట్లు వస్తే, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ బూత్‌లో ఎవరెవరు ఓట్లు వేశారో ఎవరు వేయలేదో గుర్తించే అవకాశం ఉంటుందని, తద్వారా సదరు ఓటర్లను వేధింపులకు, బెదిరింపులకు గురి చేసే ప్రమాదం ఉంటుందని ఈసీ వివరణ ఇచ్చింది.