KCR । బీఆరెస్‌ను ఓడించిన ఫ‌లితం లోకం చూస్తున్న‌ది.. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌లు

తెలంగాణ రాగానే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ వ్యవసాయ అభివృద్ధి పాలనా ప్రాధాన్యతాంశంగా ఎంచుకొని ప‌ని చేసిందని కేసీఆర్ చెప్పారు. అందుకే పదేళ్లపాటు రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎటువంటి బాధలు లేకుండా జీవించార‌న్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఖ‌ర్చుకు వెనుకాడుతున్నదని విమర్శించారు.

  • By: TAAZ    news    Mar 22, 2025 7:42 PM IST
KCR । బీఆరెస్‌ను ఓడించిన ఫ‌లితం లోకం చూస్తున్న‌ది.. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌లు

KCR । ‘తెలంగాణను కొట్లాడి సాధించుకున్నం. ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకున్నం. ప్రజలు ఏమనుకున్నారో ఏందో.. కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నరు. అది వాళ్లిష్టం. కానీ దాని ఫలితం లోకం చూస్తున్నది’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చేస్తుంటే.. ‘కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు.. రావే… రావే…’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ నన్ను వోడగొట్టి ఇంట్ల కూర్చోబెట్టిండ్రు కదా.. నేను ఎక్కడికి రావాలె? కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లా అయితది? అని కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను ఎదురు ప్ర‌శ్నించారు. పాదయాత్రలు కాదు మన మనసుతో యాత్రలు చేయాలని, బుర్రతో ఆలోచనలు చేయాలని కేసీఆర్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా మన భవిష్యత్తు తరాలను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచన చేయాలన్నారు. ‘కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లపాటు ప్రశాంతంగా బతికినాము అని తెలంగాణ సమాజం భావిస్తున్నది. ఇప్పుడు తిరిగి మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలైనయి. తెలంగాణకు ఎప్పుడూ ఇగ ఇదే లొల్లా? ప్రశాంతంగా బతుకొద్దా? తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోసను, కాళేశ్వరం నీళ్ళందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతను సభ్య సమాజానికి తెలిపేందుకంటూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్వర్యంలో 200 మంది.. రామగుండం నుంచి వారంపాటు 180 కిలోమీటర్ల పాదయాత్ర చేసి శనివారం ఎర్ర‌వెల్లి ఫాంహౌజ్‌కు చేరుకున్నారు. పాద‌యాత్ర‌ ముగింపు సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ పోయిన సంవత్సరం ఇదే రోజు నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయినాయో.. ఇందుకు కారణం ఎవరో సమాజానికి తెలియజేసేందుకు కోరుకంటి చందర్ అధ్వర్యంలో పాదయాత్ర చేయడం అభినందనీయమ‌న్నారు. పాదయాత్రలో పాల్గొన్నప్రతీ ఒక్కరినీ అభినందించారు.

నీళ్ల ప్రాధాన్యం నిర్లక్ష్యం చేశారు
తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనే పాలనా ప్రాధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే తెలంగాణకు సాగునీరు తాగునీరు సమస్య వచ్చిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్థిక సమస్యగా చూడటం ఒక అవలక్షణంగా మార్చుకున్నారని విమర్శించారు. గల్ఫ్‌ లాంటి ఎడారి దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు సముద్ర జలాలనుంచి ఉప్పును వేరుచేసి, నీటిని శుద్ధి చేసి, మంచినీరుగా వాడుకుంటున్నార‌ని గుర్తు చేశారు. మద్రాస్‌లో కూడా నీటి కొరతను అధిగమించేందుకు అటువంటి కార్యాచరణను చేపట్టిన‌ట్లు తెలిపారు. భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పని చేయాలి కానీ, వాటిని ఖర్చుకు లింకు పెట్టి ఆలోచన చేయడం తప్ప‌ని అన్నారు.

వ్యవసాయాన్నిమేం ప్రాధాన్యంగా భావించాం
తెలంగాణ రాగానే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ వ్యవసాయ అభివృద్ధి పాలనా ప్రాధాన్యతాంశంగా ఎంచుకొని ప‌ని చేసిందని కేసీఆర్ చెప్పారు. అందుకే పదేళ్లపాటు రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎటువంటి బాధలు లేకుండా జీవించార‌న్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఖ‌ర్చుకు వెనుకాడుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతుల‌కు పెట్టుబ‌డి సాయం అందించింద‌ని, ఈ పరిస్థితిని తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు. మనం ఇచ్చిన కరెంటు ఎటు పోయింది? మనం ఇచ్చిన మిషన్ భగీరథ తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎండాకాలంలో కూడా మత్తడి దునికిన చెరువులు ఇప్పుడు ఎందుకు నీరు లేక ఎండిపోతున్నాయి? అనే విషయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. పల్లెల నుంచి హైదరాబాద్‌ వంటి పట్టణాలకు బతకడానికి వచ్చిన పేదలకు నాటి మన ప్రభుత్వం అండగా నిలిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ల ఇండ్లను కూల్చివేస్తున్నదన్నారు. గోరటి వెంకన్న లాంటి కవులు రాసిన, గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది వంటి పాటల స్ఫూర్తితో పేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టామ‌ని కేసీఆర్ వివరించారు.