Simachalam | ఘనంగా.. సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • By: sr    news    Apr 30, 2025 2:55 PM IST
Simachalam | ఘనంగా.. సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Simachalam |

విధాత: ఏపీలోని విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవ కార్యక్రమం శాస్త్రయుక్తంగా వైభవంగా సాగింది. చందనోత్సవం సందర్భంగా వరాహ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా ఇప్పటికే సింహగిరికి పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరు చేశారు.

నిజ రూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రొటోకాల్‌, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు.

సింహాచలం అప్పన్నకు టీటీడీ చైర్మన్ పట్టువస్త్రాల సమర్పణ

సింహాచలం అప్పన్నకు టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు తిరుమల వెంకన్న తరుపున పట్టువస్త్రాలు సమర్పించారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తరుపున శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోని అన్ని నరసింహస్వామి క్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనది. స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేకువజామున వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం అప్పన్న విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంటుంది. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామివారు దర్శనమిస్తారు. పవిత్రమైన అక్షయతృతీయ రోజున స్వామివారి విగ్రహానికి చందనం పూత తొలగించి తిరిగి పూస్తారు. చందన యాత్ర లేదా చందనోత్సవం పేరిట ప్రతి ఏటా వైశాఖమాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు.