వందల ఏళ్ల వక్ఫ్ ఆస్తులకు.. పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి?: సుప్రీంకోర్టు

విధాత: వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు పత్రాలు ఎక్కడినుంచి వస్తాయని సుప్రీంకోర్డు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేసూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. దాఖలైన 73పిటిషన్లలో 10పిటిషన్లపై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున కపిల్ సిబాల్, కేంద్ర ప్రభుత్వం తరపున తుషార్ మెహతాలు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి పలు కీలక ప్రశ్నలు లేవనేత్తింది.
వక్ఫ్ బోర్డు మాదిరిగా హిందూ బోర్డుల్లో ముస్లింలను అంగీ కరిస్తారా? సూటిగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా? వారి ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అని నిలదీసింది. వందల ఏళ్ల నాటి వక్స్ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని, కలెక్టర్లకు అధికారాలపై స్పష్టతతో పాటు తమ సందేహాలకు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ చట్ట రూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని.. ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందరికి వర్తించే ఈ నిబంధన లౌకిక స్వభావాన్ని కలిగి ఉందన్నారు.
సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని ధర్మాసనం పేర్కొంది. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టమని.. ఇది పలు మార్లు దుర్వినియోగమైందని… అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయంది. నేను ప్రివీ కౌన్సిల్ తీర్పులను పరిశీలించాను. ‘వక్ఫ్ బై యూజర్’ గుర్తించబడింది. మీరు దానిని రద్దు చేస్తే, అది సమస్య అవుతుంది” అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా..పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా అని వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారని.. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
హింస బాధాకరం..
వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటు చేసుకోవడం బాధాకరమని, ఆ ఘటనలు తమను బాధించాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. కాగా పిటిషన్ల తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం అని వాదించారు. వక్స్ అంటే ఇస్లాంకు అంకితమైనదని పేర్కొన్నారు.
కేంద్రం తరఫున తుషార్ మెహతా తన వాదన వినిపి స్తూ.. జేపీసీ ఏర్పాటు చేసి అన్ని వర్గాలతో చర్చలు జరిపామని, వక్ఫ్ అనేది చారిటీకి సంబంధించినది మాత్రమేనని కోర్టుకు తెలిపారు. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని ఆ సంస్థల్లో హిందూయేతర అధికారులు కూడా ఉన్నారని కోర్టుకు వివరించారు. వక్ఫ్ బై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారని, రిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకు ఉన్న అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు. రేపు కూడా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగనున్న నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులకు అవకాశముందని మైనార్టీ సంఘాలు భావిస్తున్నాయి.