Bandi Sanjay: కేటీఆర్‌కు.. దమ్ముంటే ఆ BJP MP ఎవరో బయటపెట్టాలి

  • By: sr    news    Apr 12, 2025 8:03 PM IST
Bandi Sanjay: కేటీఆర్‌కు.. దమ్ముంటే ఆ BJP MP ఎవరో బయటపెట్టాలి

Bandi Sanjay:

విధాత : హెచ్ సీయూ భూముల వివాదంలో సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ సహకరిస్తున్నారన్న ఆరోపణలు చేసి కేటీఆర్ కు నిజంగా దమ్ముంటే, ఆధారాలుంటే ఆ బ్రోకర్ ఎంపీ ఎవరో బయటపెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గోషామహల్ నియోజకవర్గంలోని ఆకాశ్ పురి హనుమాన్ ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి బండి సంజయ్ పూజలు చేశారు. అనంతరం రాజాసింగ్ తో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కు దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. దుకంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటేనన్నారు. రేవంత్ సర్కార్ నన్ను రక్షకుడన్న కేటీఆర్ కు కళ్లు దొబ్నినయ్ అని సంజయ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ పై పోరాడుతున్నది బీజేపీయే కదా? 6 గ్యారంటీలపై అడుగడుగునా నిలదీస్తోంది మేమే కదా? హెచ్ సీయూ భూములపై పోరాడి జైలుకు పోయింది మేమే కదా? అసెంబ్లీలో బీఆర్ఎస్ ఏనాడైనా 6 గ్యారంటీలపై కొట్లాడిందా? .. వాకౌట్ చేసిందా?… ప్రతిరోజు 6 గ్యారంటీల హామీల ఎగవేతపై కాంగ్రెస్ ను నిలదీస్తోంది నేనే కదా అని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500లు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, 2 లక్షల ఉద్యోగాలపై నిరంతరం మాట్లాడింది, పోరాడింది బీజేపీయే కదా అని.

ప్రెస్ మీట్లకే బీఆర్ఎస్ పరిమితం

బీఆర్ ఎస్ వాళ్లు ఏనాడైనా పోరాడారా? అంతెందుకు హెచ్ సీయూ భూములపై పోరాడి జైలుకు పోయింది ఏబీవీపీ కార్యకర్తలే కదా అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ వాళ్లు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప పోరాడారా? అని బండి సంజయ్ నిలదీశారు. అయినా నేను అడుగుతున్నా… మీడియా వాళ్లను పట్టుకుని కేటీఆర్ ‘‘వాడెవడో పేపరోడు, వీడెవడో టీవోడు’ ఆ బీజేపోడు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతుంటే జర్నలిస్టులు స్పందించరా? కేటీఆర్ ను ప్రజలు ఓడగొట్టినా ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. కేసీఆరే ఇంకా అధికారంలో ఉన్నడని అనుకుంటున్నడేమో.. ఆయన అహంకారం దించుతామని హెచ్చరించారు.

కాంగ్రెస్ అగ్రనేతల మెప్పు కోసమే మోదీపై విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతల మెప్పు పొందేందుకు మోదీపై ఇష్టానుసారం మాట్లాడుతున్నడాని సంజయ్ విమర్శించారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని దీంతో ఆయన మెప్పు కోసం మోదీని తిడుతున్నాడన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇట్లనే మోదీపై అడ్డగోలుగా మాట్లాడితే ఏమైంది?… అభివృద్ధికి సహకరిస్తానని కేంద్రం చెప్పినా వినకుండా అన్యాయం చేసిండని తిట్టారని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంథాలో నడుస్తోందని… ఆ పార్టీకి కూడా బీఆర్ఎస్ కు పట్టిన గతి పడుతుందన్నారు. హెచ్ సీయూ భూముల అంశం కోర్టులో ఉందని.. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనీయబోమని, కోర్టులపై మాకు పూర్తి నమ్మకం ఉందని సంజయ్ స్పష్టం చేశారు.

సన్న బియ్యం మోదీ బియ్యమే

రేషన్ షాపులో ఇచ్చేది మోదీ బియ్యమే తప్ప రేవంత్ రెడ్డి బియ్యం, ఉత్తమ్ బియ్యం, కాంగ్రెస్ బియ్యం అని ప్రజలు చెప్పడం లేదన్నారు. రేషన్ ద్వారా అమ్మే బియ్యంలో ఒక్క కిలోకు రూ.37లు ఇస్తోంది కేంద్రమే కదా? ఆ మాట సంబంధిత మంత్రి కూడా ఒప్పుకున్నారు కదా? మరి కాంగ్రెస్ బియ్యం ఎట్లా అవుతాయని సంజయ్ ప్రశ్నించారు. . ఎందుకంటే ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు బియ్యం కోసం కేంద్రం ఖర్చు చేస్తోంది. ఒకవేళ రేషన్ బియ్యానికి సంబంధించి కేంద్ర నిధులు అక్కర్లేదని అనుకుంటే దమ్ముంటే కేంద్రానికి లేఖ రాయాలి. ‘‘మీ బియ్యం మాకు అవసరం లేదని… అందుకోసం కేంద్రం పైసలియ్యాల్సిన అవసరం లేదని.. ఆ బియ్యానికి అయ్యే పైసలన్నీ మేమే భరిస్తాం. ఖర్చు పెడతాం’’ అని కేంద్రానికి లేఖ రాసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.

మేమంతా ఒక్కటే

బీజేపీతో రాజాసింగ్ కు విబేధాలున్నాయంటూ వస్తున్న వార్తలు అవాస్తమవని మేమంతా ఒక్కటేనని సంజయ్ స్పష్టం చేశారు. రాజాసింగ్ బీజేపీ సీనియర్ నేత అని… వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న నాయకుడని… 2018లో మా ఏకైక ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. సమాజ ధర్మం, బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేసే కట్టర్ కార్యకర్త రాజాసింగ్ అని, హిందుత్వం కోసం నిరంతరం పోరాడే నాయకుడని, ఆయనతో ఎలాంటి విబేధాల్లేవని.. బీజేపీలో అందరం కలిసే ఉంటున్నామన్నారు.

సగానికి పైగా ఎదిగాం

(బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనీయబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే మేం తెలంగాణలో 50 శాతానికిపైగా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నామన్నారు. 3 ఎమ్మెల్సీలలో గెలిచామన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుస్తోంది కూడా బీజేపీయేనని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదన్నారు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీలు అభ్యర్థులనే నిలబెట్టకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇంకా మమ్మల్ని రేవంత్ రెడ్డి అడుగుపెట్టనిచ్చేదేముందని ఎద్దేవా చేశారు.

జీహెచ్ ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలువబోతుందని సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా వారి కుటుంబ సభ్యులను అడిగి ఓటు వేయాలన్నారు. వారంతా మళ్లీ వచ్చేసారి కార్పొరేటర్లుగా గెలవాలనుకుంటే..వారికి హిందువుల ఓట్లు వద్దా? అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలు మిమ్ముల్ని గెలిపిస్తారనుకుంటున్నారా? లేక రేవంత్ రెడ్డి, కేటీఆర్ గెలిపిస్తారనుకుంటున్నారా? మిమ్ముల్ని గెలిపించేది హిందువులే కదా? అని సంజయ్ గుర్తు చేశారు. పొరపాటున ఎంఐఎం అభ్యర్థికి ఓటేస్తే హిందు సమాజం క్షమించదన్నారు.