U19AsiaCup2024: అబ్బాయిలు ముంచారు.. అమ్మాయిలు కప్పు కొట్టారు

  • By: sr    news    Dec 23, 2024 12:45 AM IST
U19AsiaCup2024: అబ్బాయిలు ముంచారు.. అమ్మాయిలు కప్పు కొట్టారు

U19AsiaCup2024

కౌలాలంపూర్ వేదికగా ఆదివారం జరిగిన అండర్ -19 ఆసియా కప్ (U19 Asia Cup 2024) విజేతగా భారత మహిళా జట్టు నిలిచింది. మహిళల విభాగంలో టి-20 ఫార్మాట్‌లో తొలిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓడించి మొట్టమొదటి మహిళల ఆసియా కప్ అండర్-19 టోర్నీని కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు బంగ్లా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు చాలా ఇబ్బంది ప‌డ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్ర‌మే చేసింది. అందులోనూ మ‌న తెలుగ‌మ్మాయి గొంగడి త్రిష (52) పరుగులతో హాఫ్ సెంచరీ చేసి ఆదుకోవ‌డం విశేషం.

ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా ఈస్మీన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నిషిత అక్టర్ నిషి 2, హబీబా ఇస్లాం ఒక వికెట్ సాధించారు. అనంతరం 118 పరుగుల లక్ష్య చేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆది నుంచే తడబడింది. బంతికి ఒక పరుగు తీసినా బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించేది. కానీ భార‌త బౌల‌ర్ల ధాటికి కేవలం 76 పరుగులకే కుప్పకూలింది.

బంగ్లా బ్యాటర్లలో జువైరియా ఫెర్దౌస్ (22), ఫహౌమిదా చోయా (18) ఈ ఇద్దరు మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో ఆయూషి శుక్ల 3, సోనమ్ యాదవ్ 2, పరుణికా సిసోడియా 2, వీజే జోషిత 1 వికెట్లు పడగొట్టి భారత జట్టును విజయతీరాలకు చేర్చడంతో అండర్ – 19 మహిళల ఆసియా కప్ మొదటి ఎడిషన్‌లోనే భారత జట్టు విజేతగా నిలిచి రికార్డ్ సృష్టించింది.