Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త.. తక్కువ ధరకే సిమెంట్, స్టీల్

Indiramma Housing Scheme:
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. సిమెంట్, స్టీల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని మార్కెట్ కంటే తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రస్తుతం మార్కెట్ లో సిమెంట్ బస్తా ధర రూ. 320 గా ఉంది. అయితే ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ. 260 కే బస్తా ఇచ్చేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చినట్టు తెలుస్తున్నది. స్టీల్ టన్నుకు రూ. 55,000 ఉండగా.. రూ. 47,000కే అందించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.
ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకొనేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 5 లక్షలు ఇస్తున్నది. అయితే సిమెంట్, స్టీల్ ధరలు భారీగా ఉండటంతో రూ. 5 లక్షలతో ఇంటి నిర్మాణం సాధ్యం అవుతుందా? అన్న అనుమానాలు ఉండేవి. దీంతో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖర్చు గణనీయంగా తగ్గనున్నది. వెరసి లబ్ధిదారులకు ఊరట లభించనున్నది.