Kaleshwaram scam: ఇంజినీర్లకు కాళేశ్వరం ట్రబుల్స్

– 61 మందికి నోటీసులు!
– దేశంలోనే సంచలనం
– ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ సిద్ధం
– శ్రీముఖాలను రెడీ చేసిన విజిలెన్స్
– త్వరలో మరికొంత మందికి కూడా..
– నిర్ణీత గడువులో సంజాయిషీ ఇవ్వాలంటూ ఆదేశం
– తప్పు చేసినట్టు ఆధారాలుంటే అధికారులపై వేటు?
– కాళేశ్వరం అంచనాలను అమాంతం పెంచేసిన అధికారులు
– కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్లలో దడదడ
Kaleshwaram scam: హైదరాబాద్, మే29 (విధాత): కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నీటిపారుదలశాఖ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న 61మంది ఇంజినీర్లపై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ సిద్ధం చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. నేడో రేపో వారందరికీ విజిలెన్స్ విభాగం శ్రీముఖాలు పంపించబోతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్ప పథకమని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అంతా తలకిందులైంది. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అని ఇంజినీర్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజినీర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని సమాచారం. ఇంత పెద్ద సంఖ్యలో ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ పంపడం ఇదే తొలిసారి అని సమాచారం.
గత ప్రభుత్వంలో జోరుగా పైరవీలు
గత ప్రభుత్వంలో నీటి పారుదలశాఖలో పనిచేసిన ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో పోస్టుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేసుకున్నట్టు ఆరోపణలు వినిపించాయి. ఈ ప్రాజెక్టులో పనిచేస్తే చాలు జీవితం ధన్యమైపోతుందని వారు భావించేవారట. పనిలో పనిగా మెజారిటీ ఇంజనీర్లు పెద్ద ఎత్తున వెనకేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రూ.1 లక్ష కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. గత 14 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు లో మేడిగడ్డ బారాజ్ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బారాజ్ లీకేజీలపై జ్యూడిషియల్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్ జూన్ 5 నుంచి 9 వరకు మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావులను విచారించనున్నది. ఈ విచారణకు ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. దీంతో జ్యూడిషియల్ కమిషన్ విచారణతో గత ఏడాది కాలం నుంచి ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యుటీవ్ ఇంజనీర్ మొదలు ఇంజనీర్ ఇన్ ఛీఫ్ వరకు ఆందోళనలో ఉన్నట్టు సమాచరాం. విచారణకు హాజరు కావాలని నోటీసులు అందుకున్న సుమారు 200 మంది ఇంజినీర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వీరే కాకుండా పాతిక మంది సీనియర్ ఐఏఎస్ లు కూడా విచారణకు హాజరైన విషయం విధితమే. ఇదిలా ఉండగా ప్రాజెక్టులో అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇష్టారాజ్యంగా అవినీతి
తమదే ప్రభుత్వం, కేసీఆర్ జీవితాంతం ముఖ్యమంత్రి ఉంటారనే భ్రమలో చాలా మంది ఇంజినీర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంచనాలను అమాంతం పెంచేయడం, కాంట్రాక్టర్లు ఇచ్చిన ప్రతిపాదనలకు ఓకే చెప్పడం, వాళ్లు చెప్పినట్లుగా పనిచేయడం, థర్డ్ పార్టీ ఎంక్వైరీ లేకుండా పనులకు బిల్లులు పాస్ చేయడం వంటి పనులకు ఇంజినీర్లు తెగబడ్డట్టు ఆరోపణల వచ్చాయి. జూనియర్ లెవెల్, మిడిల్ లెవెల్ ఇంజినీర్లు తమపై అధికారులు ఆదేశాలతో నిబంధనలను ఉల్లంఘించినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం ఇంజినీర్ల పాలిట శాపంగా మారింది. మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడం, కాంగ్రెస్ పార్టీ తప్పులను ఎత్తి చూపడం ఇంజినీర్లకు కంటి నిండా కునుకు లేకుండా చేసింది. ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు అయింది. ఈ విచారణతోనే ఇప్పటికే సతమతమవుతున్న ఇంజనీర్లకు నీటి పారుదల శాఖ విజిలెన్స్ విభాగం పిడుగులాంటి వార్త వినిపించనున్నట్టు సమాచారం. అక్రమాలకు పాల్పడ్డారంటూ సుమారు 61 మంది ఇంజినీర్లపై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ సిద్ధం చేశారట. తాము లేవనెత్తిన అంశాలపై నిర్ణీత గడువులోపు సమాధానాలు పంపించాలని అందులో సంజాయిషీ కోరనున్నట్టు సమాచారం. ఆరోపణల తీవ్రత, ఆధారాలను బట్టి వారం లేదా రెండు వారాల వరకు గడువును ఇచ్చే అవకాశముందంటున్నారు. ఇంజినీర్ స్థాయిని బట్టి, అతనికి కనీసం మూడు నాలుగు ప్రశ్నలు లేదా అంశాలపై సమాధానం అడగనున్నారు. వాటికి సరైన సమాధానాలు తెలియపరిచి, ఆధారాలను అందచేసి తప్పు లేదని నిరూపించుకుంటే సరేసరి లేదంటే తమవద్ద ఆధారాలను పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్ చేస్తూ వెంటనే ఆదేశాలు జారీ చేస్తారు.
సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం
ఇప్పటికే ప్రభుత్వం వద్ద బలమైన ఆధారాలు ఉన్నందున ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమాధానం ఇచ్చిన వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. జూన్ రెండో వారంలో హైకోర్టు పునః ప్రారంభం అవుతున్నందున, ఈ లోపే ప్రభుత్వం కఠిన చర్యలను పూర్తి చేయనున్నట్టు సమాచారం. జ్యుడిషియల్ విచారణ జరుగుతున్న సమయంలో తమపై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ కింద విజిలెన్స్ విభాగం సంజాయిషీ అడుగుతున్నదని బాధిత ఇంజినీర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని ప్రభుత్వం పసిగట్టింది. ఈ లోపే 61 మందిపై చర్యలు చేపట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.