కాళేశ్వరం లోపాలకు దర్పణం.. NDSA నివేదిక: మంత్రి ఉత్తమ్

- తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడమే పెద్ద తప్పు
- డిజైన్ లోనే లోపాలు
- డీపీఆర్ మేరకు కట్టకపోవడంతో మరిన్ని సమస్యలు
- ఎన్డీఎస్ఎస్ఏను వ్యతిరేకించడం మూర్ఖత్వం
- కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మాణం..వ్యయం పెంపు
- రాష్టానికి నష్టం చేసిన మాజీ సీఎం కేసీఆర
- రాష్ట్రానికి భారంగా ప్రాజెక్టు నిర్మాణ అప్పులు.. వడ్డీలు
విధాత: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు ఎన్డీఎస్ఏ దర్పణం పట్టిందని..ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ తేల్చిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను కూడా బీఆర్ఎస్ వ్యతిరేకించడం మూర్ఖత్వమని మండిపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూసి కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సింది పోయి విమర్శలు చేయడంపై ఉత్తమ్ మండిపడ్డారు. తప్పు చేసినందుకు కేసీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. కమిషన్ల కక్కుర్తి కోసమే ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు. తుమ్మడిహట్టి కాదని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడమే ప్రధాన లోపమని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందన్నారు.
ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చవద్దని ఐదుగురు విశ్రాంత ఇంజినీర్లతో కేసీఆర్ ఏర్పాటు చేసిన నిపుణుల బృందమే చెప్పిందని గుర్తు చేశారు. మేడిగడ్డ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ప్రారంభంలోనే తోసిపుచ్చిందని.. డీపీఆర్ లో ఒకటి చెప్పి.. ప్రాజెక్టు మరో చోట కట్టారని ఎన్డీఎస్ఏ తేల్చిందన్నారు. సుందీళ్ల, అన్నారం బ్యారేజీలు కట్టాల్సిన చోట కట్టలేదన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ ను మార్చడమే పెద్ద తప్పని అన్నారు. 80వేల కోట్లతో ప్రాజెక్ట్ అంచనా వేసి లక్ష కోట్లు ఖర్చు చేశారని, కాళేశ్వరంతో రాష్ట్రంపై లక్షన్నర కోట్ల భారం పడిందన్నారు. వాళ్లు చేసిన అప్పుకు ఏడాదికి రూ. 16 వేల కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. ఎక్కువ వడ్డీకి షార్ట్ టైం లోన్లను ప్రాజెక్టు కోసం తెచ్చారని తప్పుబట్టారు.
ఎన్డీఎస్ఏ చట్టబద్ధ సంస్థ
ఎన్డీఎస్ఏ పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా ఏర్పడిందని..ఎన్డీఎస్ ఏర్పాటుకు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. దేశంలో 700 డ్యాంల భద్రత, సేఫ్టీని ఎన్డీఎస్ ఏ పర్యవేక్షిస్తోందన్నారు. వివిధ అంశాల్లో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో ఈ బోర్డు ఏర్పాటైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టాక డీపీఆర్ కు వెళ్లారని.. బ్యారేజీ నిర్మాణానికి ముందు సాయిల్ టెస్ట్ కూడా చేయలేదని.. ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. డీపీఆర్ ఆలస్యం వల్ల ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగిందని.. లోపాలున్నాయని ముందే తెలిసినా బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా బ్యారేజీలు కట్టిందని తెలిపారు. మేడిగడ్డ నిర్మాణంలో లోపాలపై బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇంజనీర్లు ప్రాథమిక నివేదిక ఇచ్చారని..బ్యారేజీ లోపలి భాగంలో నీళ్లు భూమిలోకి పోయి బ్యారేజీ వెలుపలకు వస్తున్నా పట్టించుకోని నిర్లక్ష్యం కారణంగా నష్ట తీవ్రత పెరిగిందన్నారు.
బ్యారేజీ నిర్మాణానికి మట్టి పరీక్షలు, నాణ్యత పరీక్షలు చేయలేదన్నారు. డ్యామ్ సేఫ్టీ రూల్స్ ఒక్కటి కూడా పాటించలేదని..కేసీఆర్ ఎలా చెబితే అలా బ్యారేజీలు కట్టారన్నారు. డ్యామ్ సేఫ్టీ రూల్స్ ఒక్కటి కూడా పాటించలేదని, లోపాలతోనే మేడిగడ్డ కూలిపోయిందన్నారు. అక్టోబర్ 21,2023న మేడిగడ్డ కూలిపోయిందని..ఆనాడు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. దేశంలో ఇంత పెద్ద నిర్లక్షమైన ప్రాజెక్ట్ ఇదే అని విమర్శించారు. ఇంత పెద్ద మానవ తప్పిదాన్ని ఇతర దేశాల్లో ఒప్పుకోరని..కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆరోపించారు. తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ కడతామని ఆనాడు కేసీఆర్ చెప్పారని..ఇప్పటికీ తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు.తుమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదని బీఆర్ఎస్ అబ్దాలు చెబుతోందని విమర్శించారు.