KCR అనుచరులు పగటి కలలు కంటున్నారు

  • By: sr    news    Apr 18, 2025 5:09 PM IST
KCR అనుచరులు పగటి కలలు కంటున్నారు

ప్రభుత్వాన్ని కూలగొడతామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది

రియల్ ఎస్టేట్ దందాతో వేల కోట్లు దోచుకున్నారు

విధాత ప్రత్యేక ప్రతినిధి: ప్రజలు ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్చార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నాయకులకు ఆ పార్టీ నాయకుడు కేటీఆర్ వత్తాసు పలుకుతున్నాడని విమర్శించారు. ములుగు జిల్లాలో శుక్రవారం జరిగిన రెవిన్యూ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి ఈ విషయమై స్పందించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ కు చెందిన నాయకులు రియల్ ఎస్టేట్ దందాతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులతో సంతలో కొన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వాన్ని పడగొడుదామని కెసిఆర్ అనుచరులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ ఆటలు తెలంగాణలో సాగమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన భూభారతి చట్టం వల్ల ఉపయోగాలు, గత ధరణి వల్ల జరిగిన నష్టాలను వివరించారు. సదస్సుకు ముందు ములుగు గట్టమ్మ ఆలయం నుంచి వెంకటాపురం మండల కేంద్రాన్ని వరకు మంత్రులకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.