KCR: కూటమి లేకుంటే బాబు గెలిచేవాడే కాదు.. మనం సింగిల్ గానే గెలుస్తాం

  • By: sr    news    Mar 22, 2025 6:02 PM IST
KCR: కూటమి లేకుంటే బాబు గెలిచేవాడే కాదు.. మనం సింగిల్ గానే గెలుస్తాం

KCR:

విధాత : ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదని..కాని తెలంగాణలో మళ్లీ మనమే సింగిల్ గా గెలిచి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్ళందక పంటలు ఎండిన రైతన్నల సమస్యలపై గోదావరి ఖని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. రాబోయే రోజుల్లో అధికారం మనదేనని..సింగిల్‌గానే అధికారంలోకి వస్తామన్నారు.

బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయని.. సిరిసంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారని గుర్తు చేశారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదని.. అందరూ ఒక్కో కేసీఆర్ లాగా తయారు కావాలన్నారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందన్నారు. ఆనాడు మోడీ నా మెడపై కత్తి పెట్టినా తెలంగాణ ప్రయోజనాల కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అని విమర్శించారు. తెలంగాణని ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని..నోటికి వచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని..ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేస్తుందన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టని రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌దే నని చెప్పుకొచ్చారు.