KTR | దేశంలో కుస్తీ..తెలంగాణలో దోస్తీ: కాంగ్రెస్ బీజేపీలపై కేటీఆర్ విసుర్లు
దేశంలో కుస్తీ, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ దోస్తీ చేస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై, ఎన్నికల హామీలపై ఎద్దేవా చేశారు. ఊకంటి ప్రభాకర్ రావు బీఆర్ఎస్ లో చేరారు.

విధాత : దేశంలో బీజేపీ(BJP), కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కత్తులు దూసుకుంటూ..తెలంగాణలో మాత్రం కలిసి తిరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్(Congress) నేత ఊకంటి ప్రభాకర్ రావుతో పాటు 300 మంది కార్యకర్తలు కేటీఆర్, జగదీష్ రెడ్డిల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. రాహుల్ గాంధీ ఏమో సీబీఐ మోదీకి జేబు సంస్థ అంటాడని..
రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఏమో సీబీఐ మంచి సంస్థ అని వాళ్ళకు విచారణను అప్పగిస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలన ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నా ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఏ ఒక్కరిని అడిగినా బీఆర్ఎస్(BRS) అప్పుడే బాగుండేది అని అంటున్నారని..ప్రస్తుత ప్రభుత్వ తీరు అగమ్య గోచరంగా ఉందని అంటున్నారన్నారు. రైతులు యూరియా సంక్షోభంతో సతమతమవుతున్నారని.. రాత్రి పూటనే లైన్లు కడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణి బెల్ట్‌లో ఉన్న 13 నియోజకవర్గాల్లో ఓడిపోయామని..ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు మంచిర్యాల, గోదావరి పరివాహక ప్రాంతంలోని రామగుండం, మంథని, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, సత్తుపల్లి, కొత్తగూడెంలో ఒక్క సీట్లో కూడా గెలవలేదన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఇచ్చిన 10 హామీల్లో 8 హామీలు పూర్తి చేశాం. రెండు పాక్షింగా మిగిలాయని గుర్తించామన్నారు. 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిందని.. తర్వాత వచ్చిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం జరిగింది అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని..రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చ ఎన్నికల్లో మళ్లీ విజయాలను అందుకుంటామన్నారు.