ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీఆర్ఎస్ కుట్ర: మంత్రి పొంగులేటి

కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు పన్నాగాలు చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం అవినీతి సొమ్ము ఖర్చు చేస్తోందని ఆరోపించారు

  • By: Subbu |    news |    Published on : Nov 03, 2025 2:29 PM IST
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీఆర్ఎస్ కుట్ర: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, నవంబర్ 03(విధాత): కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ సొమ్ముతో బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు పన్నాగాలు చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం అవినీతి సొమ్ము ఖర్చు చేస్తోందని ఆరోపించారు. 500 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తారో చూస్తానని అన్నారు.

సోమ‌వారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ లో మంత్రి పొంగులేటి పాదయాత్ర నిర్వహించారు. ఎస్. పి.ఆర్. హిల్స్ నుంచి జెండాకట్ట‌, కార్మిక‌న‌గ‌ర్‌, వినాయ‌క‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఆయ‌న ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్‌ను గెలిపించాల‌ని కోరారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్లతో జూబ్లీహిల్స్ ఉప ఎన్న‌క‌ల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తోంద‌న్నారు. ఆ అవినీతి సొమ్ముతోనే బిఆర్ఎస్ విచ్చలవిడి ప్రచారం చేస్తోంద‌ని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ అవినీతి సొమ్ము ఏరులై పారుతుంద‌ని, ఓడిపోతామ‌ని తెలిసి ఆపార్టీ నాయ‌కులు అవాకులు చ‌వాకులు పేలుతున్నార‌ని అన్నారు. విజ్ఞులైన ఈ ప్రాంత ఓట‌ర్లు ఉచిత బ‌స్సు మొద‌లు కొని ఎన్నోసంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లు చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి న‌వీన్ యాద‌వ్ ను మంచి మెజార్టీతో గెలిపించాల‌న్నారు.

ప‌దేళ్లలో చేయ‌ని అభివృద్ది ఇప్పుడు బీఆర్ఎస్ వ‌ల‌న ఏమి జ‌రుగుతుంద‌ని ప్రశ్నించారు. మీ గ‌ల్లీల్లోకి వ‌చ్చే బీఆర్ఎస్ నాయ‌కులను ఇంత‌వ‌ర‌కు ఏం అభివృద్ది చేశారో చెప్పాలంటూ ప్రశ్నించాలని మంత్రి ప్రజలను కోరారు. ఈ మూడేళ్లే గాక మ‌రో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంద‌ని, పేదోళ్ల క‌న్నీరు తుడిచేవ‌ర‌కు కాంగ్రెస్ విశ్రమించదని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిర‌మ్మ ఇండ్లకు సంబంధించి తాము ఇంత‌వ‌ర‌కు గ్రామీణ ప్రజలపై దృష్టి సారించామ‌ని ఇక‌పై పట్టణ పేద‌ల‌కు ఇండ్లు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.