ponguleti: ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకః మంత్రి పొంగులేటి

ponguleti: ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలనుకొనేవారు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఉచితంగా ఇసుకను పొందవచ్చని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని.. అధికార యంత్రాంగం ఈ నిర్ణయం అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ములుగులో ఐటీడీఏతో కలిపి 5 వేల ఇళ్లు ఇచ్చామని వాటికి అదనంగా మరో వెయ్యి ఇండ్ల కోసం జాబితాను అధికారులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇల్లు రాలేదని ఆడబిడ్డలు బాధపడాల్సిన అవసరం లేదని మలివిడతలో కచ్చితంగా మిగిలిన పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని .. అప్పులకు వడ్డీలు, అసలు కింద ప్రభుత్వం రూ. 6500 కోట్లు చెల్లిస్తున్నదని చెప్పారు. అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.