నకిలీ విత్తనాలతో రైతు నష్టపోవడానికి వీలు లేకుండా చట్టం: మంత్రి తుమ్మల

తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం-2025 పై ఈ రోజు సెక్రటేరియట్ లో డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశమయ్యారు

  • By: Subbu |    news |    Published on : Nov 02, 2025 3:34 PM IST
నకిలీ విత్తనాలతో రైతు నష్టపోవడానికి వీలు లేకుండా చట్టం: మంత్రి తుమ్మల

హైదరాబాద్, నవంబర్ 2 (విధాత): తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం-2025 పై ఈ రోజు సెక్రటేరియట్ లో డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమావేశమయ్యారు. డ్రాఫ్ట్ కమిటీ ప్రతిపాదించిన ‘ముసాయిదా చట్టం విధివిధానాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయంలో విత్తనం అనేది ప్రాథమిక అవసరం అనీ, వ్యవసాయం / ఉద్యానవనంలో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రావడం వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారని, విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు 1983 అమలులో పలు లోపాలు ఉండటంతో విత్తన సంస్థలు చట్టంలోని బాలహీనతను దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. దానిని అధిగమించేందుకు వీలుగా డ్రాఫ్ట్ కమిటీ వేసిన సందర్భాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ నేపథ్యలో డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు ప్రతిస్పందిస్తూ ప్రస్తుత విత్తన చట్టాల వివరాలు, వాటిలో ఉన్న లోపాలు, తద్వారా రైతులు ఏవిధంగా నష్టపోతున్నారని మంత్రికి వివరించారు. ఆ వివరాలు చూసుకొన్నట్లైతే..
ప్రస్తుతము అములులో ఉన్న విత్తన చట్టం, 1966.
1. నోటిఫై చేసిన వంగడాలకు మాత్రము వర్తిస్తుంది.
2. విత్తనోత్పత్తి పై చట్టపరంగా ఎటువంటి నియంత్రణ లేదు.
3. విత్తన రకాలు మరియు హైబ్రిడ్ల రిజిస్ట్రేషన్ తప్పని సరికాదు.
4. ధరల నియంత్రణ మరియు ధరల స్థిరీకరణకు అధికారము లేకపోవడం.
5. రైతులు పండించిన పంటలో నాణ్యత లేని విత్తనముల సరఫరా చేయబడటం మూలంగా పంట నష్టము వాటిల్లినప్పుడు త్వరితగతిన పరిష్కరించి, ఆ విధంగా సరఫరా చేసిన కంపెనీ నుండి నష్టపరిహారం పొందు వీలు లేక పోవడం.
6. ప్రత్యేక పరిస్థితులలో విత్తన పంటలు వేసి విత్తన ఉత్పత్తిలో ఒప్పందం కుదుర్చుకున్న విధంగా కాకుండా ఉల్లంఘిచినట్టైతే ఆ విత్తన రైతులకు తగు నష్టపరిహారం ఇప్పించే వీలులేక పోవడం.
7. విత్తన ఉత్పత్తి మరియు పంపిణీకి సంబంధిచిన అనుబంధ అంశాల పై నియంత్రణ అవకాశాలు లేవు.
8. పచ్చిరొట్ట విత్తనాలు చట్ట పరిధిలో లేక పోవడము.
9. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు లేదా సంస్థల పై తీసుకోనే చర్యలు లేదా విధించే శిక్షలు కఠినతరంగా లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత విత్తన చట్టం ను ముసాయిదా 2025 రూపొందించడం జరిగిందని సభ్యులు వివరించారు.

అయితే ప్రస్తుత ముసాయిదా తెలంగాణలో విత్తన ఉత్పత్తికి సంబంధించి తయారు చేయడం జరిగిందని, ఇందులో ప్రధానంగా విత్తన రైతుల హక్కులు, సంక్షేమం కాపాడడం, రైతు-కంపెనీ ఒప్పందాల్లో న్యాయం, నాసిరకం విత్తనాల వల్ల నష్టం కలిగిన రైతులకు పరిహారం చెల్లించే విధంగా చట్టం, పారదర్శకత, భాద్యత, నియంత్రణలను బలోపేతం చేయడం, సాంప్రదాయ విత్తనాల పరిరక్షణ, నిల్వ ప్రోత్సాహం వంటి అంశాలను చేర్చినట్లు, మొత్తం 8 ఆద్యాయాలు, 32 సెక్షన్లు పొందుపర్చినట్లు తెలియజేశారు.
విత్తనోత్పత్తికి సంబంధించి ఒక సంస్థాగత వ్యవస్థ ఏర్పాటు చేయడం, విత్తన ఉత్పత్తి నియంత్రణ, పర్యవేక్షణ, వివాదపరిష్కారాలు ఇందులో పొందుపరచడం జరిగిందని వెల్లడించారు. అంతే గాక విత్తన రైతుల సంక్షేమం కోసం విత్తన రైతులకు క్రెడిట్ పెంచి ఇవ్వడం, విత్తనోత్పత్తిపై సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు రూపొందించడం, సీడ్ కో ఆపరేటివ్ లు , కమ్యూటి సీడ్ బ్యాంకులకు ఆర్థిక సహాయం లాంటి విషయాలు కూడా పొందుపర్చడం జరిగిందని తెలిపారు.

విత్తన ఉత్పత్తి నియంత్రణ కోసం రాష్ట్ర లైసెన్స్ ఉన్న సంస్థలకే అనుమతి, రైతు, ఆర్గనైజర్, కంపెనీ మధ్య త్రి పక్ష ఒప్పందం, కంపెనీలు విత్తన ప్రోగ్రాం సమర్పించడం తప్పని సరి చేయడం చెల్లింపులో 2/3 భాగం సరఫరా కాలంలో మిగతా భాగం GOI తరవాత 30 రోజుల్లో చెల్లించే విధంగా మరియు రిజిస్ట్రేషన్ కు నిర్దిష్ట కాల పరిమితి విధించడం లాంటివి ఉన్నాయి.

ఈ క్రమంలో డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు ఒక్కొక్కరు వారి అభిప్రాయాలను మంత్రికి తెలియచేశారు. పిమ్మట మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం చట్టంలో ఉన్న అన్నీ నిబంధనలను, విత్తన కంపెనీల నియంత్రణలో ఉన్న సాధ్య సాధ్యలను పూర్తిస్థాయిలో పరిశీలించి వాటిని అమలు చేయడం ప్రస్తుత కర్తవ్యం అనీ, కేవలం విత్తనోత్పత్తికే పరిమితం కాకుండా విత్తనం కొన్న ప్రతీరైతుకు, పంట నష్టపోయిన సందర్భంలో న్యాయం జరిగే విధంగా చూడడం మన తక్షణ భాద్యత అని దీనికి ప్రస్తుత చట్ట పరిధిలో ఉన్న అన్నీ అవకాశాలు పరిశీలించాల్సిందిగా సూచించారు. అదే విధంగా ఒక ప్రక్క చట్ట బద్ధంగా వ్యవహరిస్తూ, నాణ్యమైన విత్తనోత్పత్తి చేస్తూ, రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తూన్న కంపెనీలకు ప్రోతహిస్తూ, అదే సమయంలో రాత్రికి రాత్రే, పుట్టుకొస్తు R&D Facilities లేకుండా సంవత్సరానికో కొత్తరకాన్ని ఉత్పత్తి చేస్తున్న కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరించే విధంగా చూడాలని, వీటిని నియంత్రించే విధంగా ముసాయిదా రూపకల్పన జరగాలని ఆకాంక్షించారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు దేశంలో మొట్ట మొదటి సారి ప్రత్తి విత్తన చట్టం తీసుకువచ్చి రూ. 1800/- గా ఉన్న బిటి ప్రత్తి ప్యాకెట్ ధర రూ. 650/- కు తీసుకువచ్చామని తర్వాత దేశవ్యాప్తంగా ప్రత్తి ప్యాకెట్ల ధర నియంత్రణ ఆరంభమైందని గుర్తు చేశారు. ప్రస్తుత చట్టం ముసాయిదా కూడా అవసరమైతే కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చే చట్టం, అమలులో ఉన్న చట్టాలకు అనుబంధంగా మాత్రమే తీసుకువస్తున్నమని, ప్రస్తుత చట్టం లేని అంశాలను మరియు పరిహారం చెల్లింపు వంటి వాటిపై దృష్టి సారించాలని, న్యాయ సమీక్షను నిలబడే విధంగా పటిష్టంగా రూపొందించాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకులు డాll B. గోపి IAS, సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి , అడ్వకేట్ సునీల్ కుమార్, సీడ్ డైరెక్టర్ M.V నగేష్ కుమార్ , ED రామాంజినేయులు , శ్రీనివాస్ రెడ్డి , పాలసీ నిపుణులు D. నరసింహారెడ్డి , K. శివ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.