Nagarjun Sagar Dam | సాగర్ 26 క్రస్ట్ గేట్లనుంచి కృష్ణమ్మ పరవళ్లు..
నాగార్జునసాగర్‌లో 26 గేట్ల ఎత్తివేత – 18 ఏళ్ల తర్వాత ఘన దృశ్యం! భారీ వరదలతో నీటి మట్టం గరిష్టానికి.. మంత్రులు జలహారతితో గేట్లు ఎత్తివేత ప్రారంభం. కోమటిరెడ్డి నొసలుబెట్టిన అంశం హైలైట్.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆడ్లురి లక్ష్మణ్‌లు మంగళవారం ప్రత్యేక పూజల అనంతరం 13,14క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుల చేశారు. నాగార్జునసాగర్ నుంచి జూలై నెలలోనే క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయడం 18 ఏళ్ల తర్వాత ఇది తొలిసారి కావడం గమనార్హం. సాగర్ ప్రాజెక్టుకు ఎగువన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తుండగా నీటి నిల్వ గరిష్ట మట్టానికి చేరుకోవడంత గేట్లు ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నెహ్రు వేసిన పునాది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వర ప్రదాయనిగా మారిందన్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభమైందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడంతో పాటు రైతుల పక్షపాతిగా ఉందన్నారు. షెడ్యూల్‌కు ముందే ఎడమకాలువ ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రైతాంగానికి ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల నేతృత్వంలో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రికార్డు సృష్టించిందని వెల్లడించారు.
గత సంవత్సరం ఖరీఫ్,రబీ సీజన్ లు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించామని తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం 22.12 లక్షల ఎకరాలు ఉండగా.. కుడి కాలువ ఆయకట్టు కింద 11.74 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ విస్తీర్ణం 10.38 లక్షల ఎకరాలు ఉందన్నారు. అందులో తెలంగాణా భూభాగంలో 6.30 లక్షల ఎకరాలకు, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 4.08 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు త్రాగు నీరు అందిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ అని వివరించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరగగా 1967 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రారంభం జరిగిందని గుర్తుచేశారు. అరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కృష్ణా పరివాహక ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నానను అని మంత్రి ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందిస్తామన్నారు. 30 వేల క్యూసెక్కుల నీటి వినియోగంతో సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి 7 యూనిట్స్ లలో 700 మేఘవాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఎడమ కాలువ నీటి వినియోగంతో 2 యూనిట్స్ లలో 60 మేఘవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు కుందురు జయవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి డుమ్మా
నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత కార్యక్రమానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ముగ్గురు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆడ్లూరి లక్ష్మణ్ హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం కోమటిరెడ్డి ఉదయం 9గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే, 10గంటల వరకు కూడా ఉత్తమ్ రాలేదు. దీంతో ఉత్తమ్ రాక కోసం ఎదురుచూసి విసుగెత్తిన కోమటిరెడ్డి అలిగి ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి వెళ్లిపోయారు. సాగర్ క్రస్ట్ గేట్ల ఎత్తివేతకు దూరంగా ఉన్నారు. కేవలం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ లు మాత్రమే క్రస్ట్ గేట్లను ఎత్తి నీటి విడుదల తతంగం నిర్వహించారు.