Telangana | డిగ్రీ పరీక్షలు లేవు.. ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు: రాణి రుద్రమ

విధాత: తెలంగాణలో కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో డిగ్రీ పరీక్షలు నిర్వహించక లక్షమంది డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన విద్యాశాఖ, హోంశాఖలను స్వయంగా తన దగ్గరే పెట్టుకున్నారని..విద్యాశాఖపై ఇంతవరకు ఒక్కసారి అయినా సమీక్ష నిర్వహించలేదన్నారు.
లక్షల మంది డిగ్రీ విద్యార్థుల కోసం పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేయడం అత్యంత దౌర్భాగ్యకరమన్నారు. అటు ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా దోస్త్ డిగ్రీ ఆడ్మిషన్ల నోటిఫికేషక్ ఇప్పటిదాకా జారీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టి, రాహుల్ గాంధీతో చెప్పించి, ప్రైవేటు కాలేజీలను నిండా ముంచి విద్యార్థులను ఆగం చేస్తున్నారని రుద్రమ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కాలేజీలకు మొత్తం రూ. 650 కోట్లు రీయింబర్స్ మెంట్ చెల్లించాల్సి ఉందని..కానీ అందాల పోటీలకు ఖర్చు పెట్టడానికి మాత్రం నిధులు దొరుకుతున్నాయని ఎద్దేవా చేశారు. ము ఖ్యమంత్రి విదేశీ పర్యటనల ఖర్చులు, మంత్రుల హెలికాప్టర్ల హంగు, ఆర్భాటాల పర్యటనల కోసం ఖర్చు చేసే కోట్లాది రూపాయలను డిగ్రీ కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించవచ్చని హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతోనే విద్యావ్యవస్థ క్షీణించగా, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ లక్షల మంది డిగ్రీ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోతున్నారన్నారు. కొత్తగా ముద్రించిన పాఠ్యపుస్తకాలపై పాత ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంటే.. తెలంగాణ అంతటా వాటిని పంపిణీ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునే సోయిలో లేదని ఎద్దేవా చేశారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐదుసార్లు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నాలుగుసార్లు, పాలమూరు విశ్వవిద్యాలయంలో మూడుసార్లు, శాతవాహన, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో నాలుగుసార్లు డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు జరగుతాయో లేదో అన్న అనిశ్చితి విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.వెంకట్ రెడ్డి మాట్లాడూతూ తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టే, ఇప్పుడు అదే తంతు కొనసాగుతోందని విమర్శించారు.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని.. ఆ కమిటీ రూపొందించిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించారన్నారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం ఆ నివేదికను పట్టించుకోకుండా, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి పర్యవేక్షణా పరిధిలో ఉంటేనే విద్యాశాఖకు ఫలితం అని డొంక తిరుగుడు మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, 15 నెలల్లో ఒక్కసారి కూడా విద్యాశాఖ పై సమీక్ష ఎందుకు జరపలేదు? తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఎక్కడ? ఈరోజు 5 విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న కళాశాలలో డిగ్రీ పరీక్షలు ఎందుకు జరగడం… pic.twitter.com/MONoSbvQ2i
— BJP Telangana (@BJP4Telangana) April 30, 2025