Tollgates | మే1 నుంచి టోల్ గేట్ల వద్ద ఆగేదే లేదు! ఇక అంతా జీపీఎస్..

విధాత: రహదారులపై ఇక టోల్ గేట్స్ మాయం కానున్నాయి. ఇండియాలో మే 1 నుండి జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను ప్రారంభించే ఆవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే విదేశాలలో ఈ వ్వవస్థ దశాబ్ద కాలం పైగా విజయవంతంగా నడుస్తుండడంతో ఇప్పుడు మన దేశంలోనూ ప్రవేశ పెట్టేందుకు రెడీ అయి ఇకపై దేశంలోని హైవేలపై టోల్ ప్లాజాలతో పనిలేకుండా శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుకు సిద్దమవుతోంది. మే 1, 2025 నుంచి భారతదేశంలో టోల్ కలెక్షన్ విధానంలో విప్లవాత్మక మార్పు అమలులోకి రానుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతికి బదులుగా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతోంది.
ఈ కొత్త విధానంతో పారదర్శకమైన టోల్ వసూళ్లు రానున్నాయి. రద్దీని తగ్గించడానికి ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దశల వారీగా జాతీయ రహదారులపై ఫాస్టాగ్‌ను ఎత్తివేయనుంది. కొత్త విధానం ప్రకారం, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ఆధారంగా వాహనాల నెంబర్ ప్లేట్‌ను ఉపగ్రహాల ద్వారా రియల్ టైమ్ లో ట్రాక్ చేస్తూ టోల్ వసూలు చేయనున్నారు. వాహనాల్లో ఫ్యాక్టరీ-ఫిట్ లేదా రెట్రోఫిట్ జీపీఎస్(GPS) డివైస్‌లు అమర్చుతారు. ఈ సిస్టమ్ వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్‌ను లెక్కిస్తుంది. ఫలితంగా సరసమైన ఛార్జీలు వసూలు చేస్తారు. టోల్ బూత్‌ల వద్ద ఆగకుండా ఆటోమెటిక్ పేమెంట్ సాధ్యమవుతుంది. ఇది ట్రాఫిక్ జామ్‌లను తగ్గిస్తుంది.
ప్రైవేట్ వాహన యజమానులు రోజుకు మొదటి 20 కిలోమీటర్లు నేషనల్ హైవేలపై టోల్ రహితంగా ప్రయాణించవచ్చు. దూరం ఆధారంగా టోల్ ఛార్జీలు వసూలు కావడం వల్ల వినియోగదారుల నుంచి అంతే చార్జీ వసూలు చేస్తారు. టోల్ బూత్‌ల వద్ద వేచి ఉండే సమయం తగ్గడం వల్ల ఇంధన వృథా తగ్గుతుంది. తక్కువ ఇంధన వినియోగం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని కేంద్రం చెప్తోంది. అటు ఈజీపీఎస్ ఆధారిత వ్యవస్థ అమలులోకి రాగానే రహదారులపై ఉన్న భౌతిక టోల్ గేట్ లు తొలగించబడతాయి.
వాహన యజమానుల బ్యాంక్ ఖాతాల నుంచి టోల్ చార్జీలు నేరుగా,శాటిలైట్ ట్రాకింగ్, నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికత సహాయంతో ఆటోమేటిక్‌గా కట్ చేయబడతాయి. ఈ విధానం ప్రధానంగా టోల్ బూత్‌ల తొలగింపు, మౌలిక వ్యయాల తగ్గింపు, నిర్వహణ ఖర్చుల తగ్గింపు వంటి ప్రయోజనాలను అందించనుంది. వాహన యజమానులు తమ ఫాస్టాగ్ ఖాతాలను అప్‌డేట్ చేసుకోవాలి, కొత్త GPS సిస్టమ్‌కు మార్పు కోసం ఎన్ హెచ్ఏఐ(NHAI) వెబ్‌సైట్ (https://nhai.gov.in) లేదా MoRTH మార్గదర్శకాలను చెక్ చేసుకోవాలని, టోల్ ఛార్జీలు, రూట్ సమాచారం కోసం ఎన్ హెచ్ఏఐ(NHAI) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచిస్తున్నారు.
రూ.3000తో సూపర్ ప్లాన్ టోల్ పాస్
సామాన్యుల ప్రయాణ ఖర్చు తగ్గించేలా ఇకపై టోల్ వసూలు చేపట్టనున్నారు. ఇందుకోసం టోల్ చార్జీలపై భారీగా రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం సిద్దమైంది. ప్రయాణ సమయంలో ప్రతిసారి ఫాస్టాగ్ రీచార్జ్ అవసరం లేకుండా ఏడాదికి ఒకేసారి టోల్ పాస్ అవకాశాన్ని కల్పించనున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ హైవేలపై టోల్ ప్లాజాల ద్వారా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో టోల్ ప్లాజా వద్ద ఒక్కోలా చార్జీలు ఉంటున్నాయి. ఇలా ప్రతిసారి టోల్ చెల్లించకుండా నిత్యం ఆ టోల్ గేట్ ద్వారా ప్రయాణం సాగించేవారు నెలవారి పాసులు పొందవచ్చు. నెలకు రూ. 340 టోల్ పాస్ కోసం చెల్లించాలి.. అంటే ఏడాదికి రూ. 4,080 ఖర్చు అవుతుంది.
అందులోనూ కేవలం ఆ ఒక్క టోల్ గేట్ లోనే ఆ పాస్ పనిచేస్తుంది. అయితే కొత్త టోల్ పాలసీలో ఏడాదికి కేవలం రూ.3 వేలు చెల్లించి టోల్ పాస్ పొందవచ్చు. ఇది దేశంలోని అన్ని టోల్ ప్లాజాల్లో పనిచేస్తుంది. అంటే నెలవారి పాసులతో పోలిస్తే ఈ ఏడాది కాల వ్యవధి టోల్ పాస్ తక్కువ ధరకు రావడంతో పాటు కొంత డబ్బు వాహదారులకు ఆదా కానుంది.
లైఫ్ టైమ్ టోల్ పాస్
ఏడాది టోల్ పాస్ లతో పాటు వెహికిల్ లైఫ్ టైమ్ టోల్ పాసుల జారీకి కూడా కేంద్రం సిద్దమవుతోంది. అంటే ఓ వాహనానికి 15 ఏళ్లపాటు టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.30 వేలు చెల్లించి పాస్ తీసుకోవాలన్నమాట. ఈ లైఫ్ టైమ్ పాస్ ను కూడా కొత్త టోల్ పాలసీ ద్వారా ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.