ఆపరేషన్ కగార్ ఎత్తివేయాలి.. ఆదివాసుల్ని రక్షించాలి

  • By: sr    news    Apr 09, 2025 7:07 AM IST
ఆపరేషన్ కగార్ ఎత్తివేయాలి.. ఆదివాసుల్ని రక్షించాలి
  • మావోయిస్టులతో కేంద్ర సర్కార్ శాంతి చర్చలను ప్రారంభించాలి
  • సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిర్వహించిన ప్రజాధర్నా డిమాండ్

విధాత: చతిస్గడ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆదివాసిజాతి హనాన్ని వెంటనే ఆపివేయాలని ఆపరేషన్ కగార్ ను ఆపివేసి- గిరిజనుల జీవించే హక్కును పరిరక్షించాలని, మావోయిస్టులతో కేంద్ర సర్కారు శాంతి చర్చలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని ఇందిరాపార్కు వద్ద గల ధర్నా చౌక్ లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించడం జరిగింది. బస్తర్ ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధం ఆదివాసి జాతి అంతానికే తప్ప వారి సంక్షేమానికి ఏమాత్రం కాదని ధర్నాలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మేధావులు, ఆలోచనపరులు ముక్తకంఠంతో కేంద్ర సర్కార్ ను డిమాండ్ చేశారు.

దేశానికి ఆదివాసులే మొదటి హీరోలు

తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వందలాదిగా హాజరైన ఈ ప్రజా ధర్నాను ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు రమా మేల్కోటే ప్రారంభిస్తూ చతిస్గడ్ లో కొనసాగుతున్న ఆదివాసిల పై హత్యాకాండను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపివేయాలన్నారు. సమాజ మనుగడలో అభివృద్ధిలో వికాసంలో ఆదివాసుల పాత్ర ప్రధానమైనదిగా కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇప్పటికైనా గుర్తించాలన్నారు.సహజ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే అడవుల్లో ఉండే ఆదివాసులే నిజమైన హీరోలుగా చరిత్ర చెబుతుందన్నారు. ఆపరేషన్ కగార్ ను ఎత్తివేయడం ద్వారా ఆదివాసీ జాతిని రక్షించాలన్నారు.

మావోయిస్టులతో శాంతి చర్చలను ప్రారంభించాలి

మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణానికి కేంద్ర సర్కారు ముందుకు రావాల్సిన అవసరం ఉందని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జేవి చలపతిరావు స్పష్టికరించారు. మావోయిస్టులు లేదా నక్సలైట్లు అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్నారని మాట్లాడడం సరికాదన్నారు. భూమి,ప్రజాస్వామ్యం,సమానత్వం కోసమే నక్సలైట్లు దశాబ్దాల తరబడి పోరాడుతున్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. నిజానికి పాలకవర్గ పార్టీలే హింసకాండను తలపెడుతున్నాయన్నారు. అహింసకాండ నుండి తమను తాము రక్షించుకోవడానికి ఆయుధం పట్టవలసిన స్థితి కల్పించారని మర్చిపోతున్నారు. మావోయిస్టులు ప్రతిపాదించిన శాంతి చర్చలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ సాధినేని వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో సిపిఐ నాయకురాలు పాశ్య పద్మ, సిపిఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ నాయకురాలు కె రామా, ఎం.సీ.పీ. ఐ. (యు) నాయకులు మట్టయ్య, లిబిరేష్ న్ నాయకులు రమేష్ రాజా, రెడ్ ప్లాగ్ నాయకులు రాజేష్, టీజె్స్ నాయకులు ప్రో కోదండరాం, అరుణదయ నాయకురాలు విమలక్క, ఆప్ కన్వినర్ డ్రా.సుధాకర్, ప్రో. కాశిం, ప్రో గడ్డ లక్ష్మిన్, ప్రో.వినాయక రెడ్డి, కన్నగంటి రవి, రాఘవాచారి, రవిచంద్ర, డ్రా కృష్ణ ప్రసాద్, విరసం నాయకులు రాంకీ,కె.సజయ,టీపీఫ్ నాగభూషణం,మోకాళ్ళ మురళీ కృష్ణ, వి. సంధ్య,కె.గోవర్ధన్, అంబటి నాగయ్య, తదితరులు ధర్నాలో మాట్లాడారు.ఆపరేషన్ కాగార్ ను నిలిపివేయాలని, దానికోసం విశాల ప్రతిపదికన ఉద్యమం ముందుకు సాగాలన్నారు.