Phone tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్‌రావు అరెస్ట్.. ట్విస్ట్ వేరే!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాలకు పరారీ అయిన శ్రవణ్ రావు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో హైదరాబాద్ వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. అయితే ఆయన ట్యాపింగ్ పై పోలీసులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, విచారణకు సహకరించని విషయం తెలిసిందే.

Phone tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, టీవీ ఛానల్ యజమాని ఏ శ్రవణ్ కుమార్ రావును సిటీ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వగా మంగళవారం హాజరయ్యారు. విచారణ తరువాత శ్రవణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ మిథిలానగర్ కాలనీ వాసి, అఖండ్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ ఏ.ఆకర్ష్ కృష్ణ గత నెల 25వ తేదీన సీసీఎస్ లో శ్రవణ్ రావుతో పాటు అకోర్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్లు ఉమా మహేశ్వర్ రెడ్డి, కేబీ.వేదమూర్తి, ఏ.స్వాతిరావు లపై ఫిర్యాదు చేశారు.
కర్నాటక రాష్ట్రం బళ్లారి లోని అకోర్ ఇండస్ట్రీస్ నుంచి ముడి ఇనుము (ఐరన్ ఓర్) ఇప్పిస్తానని బ్రోకర్ గా వ్యవహరించి, ఇప్పించకుండా మోసం చేశారని ఫిర్యాదులో తెలిపారు. విడతల వారీగా సుమారు రూ.6.58 కోట్లు చెల్లించి నష్టపోయినట్లు వివరించారు. తమను మోసం చేసిన నమ్మకద్రోహి శ్రవణ్ రావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో అరెస్టు చేసిన శ్రవణ్ రావును నాంపల్లిలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (12) ఇంటికి తరలించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాలకు పరారీ అయిన శ్రవణ్ రావు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో హైదరాబాద్ వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. అయితే ఆయన ట్యాపింగ్ పై పోలీసులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, విచారణకు సహకరించని విషయం తెలిసిందే. విచారణకు సహకరించకుండా అతని బెయిల్ రద్దు చేసి, కస్టడీకి అప్పగించాలని ఈ నెల 5వ తేదీన సిట్ సుప్రీంకోర్టు లో పిటీషన్ వేసింది కూడా.