Telephone Tapping Case | ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే ఫోన్ ట్యాపింగ్.. ఎవరి ఆదేశాలతో చేశారో వెల్లడించాలి: మాజీ మంత్రి ఈటల రాజేందర్

Telephone Tapping Case | ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే ఫోన్ ట్యాపింగ్ చేశారని మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరిఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఎవరి ఆదేశాలతో ఫోన్లు ట్యాపింగ్ చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం ఈటలతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిలు సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన అనంతరంమీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ 2018ఎన్నికల్లోనే నన్ను ఓడగొట్టాలని మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ తో ప్రయత్నించారని..2021లో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరిని కలుస్తున్నానో ట్యాపింగ్ ద్వారా అన్ని తెలుసుకున్నారు. 2023లో కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి నన్ను గజ్వేల్, హుజురాబాద్ లలో ఓడగొట్టారన్నారు. దేశద్రోహులు, టెర్రరిస్టులపై నిఘా పెట్టకుండా ప్రతిపక్ష నాయకులపై పెట్టారన్నారు. సిట్ అధికారులు మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా కాల్ డేటాలో చూపించారని తెలిపారు. తాను 2018నుంచి పోటీ చేసిన అన్ని ఎన్నికల సందర్భంగా నా ఫోన్లు ట్యాపింగ్ చేశారని..నేను ఎవరితో మాట్లాడినా కాల్ విని అందరినీ బెదిరించేవారని చెప్పుకొచ్చారు. తమ నాయకులకు సంబంధించిన అన్ని సంభాషణలు కూడా వినేవారని అన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలలో ఎక్కడ ఉంటున్నాం.. ఎవరితో మాట్లాడుతున్నాం, మా పార్టీ ప్రణాళికలను కూడా పూర్తిగా వినేవారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే ఫోన్ ట్యాపింగ్ చేశారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలో విచారణ కమిటీ వేశారు కానీ దర్యాప్తు వేగంగా జరగడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య రహస్య అవగాహన
పోన్ ట్యాపింగ్‌పై విచారణ కమిషన్ వేసి ఏడాదిన్నర కావస్తుందని..కాళేశ్వరం కమిషన్ విచారణ కమిటీ నివేదిక రాలేదని..కాంగ్రెస్, బీఆర్ఎస్ లు లాలూచీపడకపోతే విచారణ నివేదికలు ఎందుకు భయటపెట్టడంలేదో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందన్నారు. ప్రభాకర్‌రావు ఐపీఎస్ అధికారి కూడా కాదని..అయినా, ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారని..అదికూడా రిటరైన అధికారిని అక్రమంగా నియమించారని ఈటల గుర్తు చేశారు. ఎస్ఐబీ చీఫ్ నియామకంలో మార్గదర్శకాలను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. గతంలో ఇంటెలిజెన్స్ మొత్తం కేసీఆర్ వద్దే ఉండేదన్నారు. ఫోన్లు ట్యాప్ చేయడం ప్రజాస్వామ్య విరుద్దమని.. జడ్జిలు, మంత్రులు, పార్టీ ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఈటల పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఆటంకం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.
బీజేపీని దెబ్బ తీయడానికే ఫోన్ ట్యాపింగ్: ప్రేమేందర్ రెడ్డి
తన రెండు ఫోన్లు ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశారని సిట్ అధికారులకు బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి వివరించారు. బీజేపీని దెబ్బ తీయడానికే ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడ్డారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఓడిపోయిందని ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ప్రభుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడటం సిగ్గు చేటని అన్నారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలు, జర్నలిస్ట్, సినిమా వాళ్ల ఫోన్ కాల్స్ వినడం దారుణమని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బాధితులు వేల సంఖ్యలో ఉన్నారని …కానీ కొద్ది మందిని మాత్రమే సాక్షులుగా పిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ రక్షణ, భద్రత కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్.. రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దోషులు తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు.
మా ఫోన్లు కూడా ట్యాపింగ్
మా ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సిట్ అధికారులకి ఫిర్యాదు చేశారు. 2020 నుంచి 2024 వరకు తన ఫోన్ సంభాషణలను రహస్యంగా తెలుసుకున్నారని ఫిర్యాదులో మాధవరం కృష్ణారావు తెలిపారు. తెలంగాణ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెజండ్ల కిషోర్ బాబు సైతం కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసినట్లు సిట్‌కి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలను సిట్ అధికారులకి కిషోర్ బాబు ఇచ్చారు.