Phone Tapping | ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీ ఈటల, గుజ్జల, గంగిడిలకు సిట్‌ పిలుపు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు టీ ప్రభాకర్ రావు వరుసగా ఆరోసారి సోమవారం మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తునట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారని సమాచారం. నాలుగేళ్లలో వేల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించారు.

  • By: TAAZ    crime    Jun 23, 2025 6:23 PM IST
Phone Tapping | ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీ ఈటల, గుజ్జల, గంగిడిలకు సిట్‌ పిలుపు!

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సంస్థ సిట్ నుంచి మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందరకు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డిలకు పిలుపు వెళ్లింది. ఈటల, ప్రేమేంద్ రెడ్డిలను రేపు ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ కోరింది. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) బాధితుల జాబితాలో వారు కూడా ఉండటంతో వారిని సిట్ సాక్షులుగా విచారించి వాంగ్మూలం తీసుకోనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంతో పాటు అంతకుముందు.. తర్వాత తన ఫోన్ ట్యాపింగ్ గురైనట్లుగా ఈటలు పలు సందర్భాల్లో తెలిపారు. అలాగే మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగిడి ఫోన్ కూడా ట్యాపింగ్ గురైంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఇన్‌చార్జ్‌గా మనోహర్ రెడ్డి వ్యవహరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ వెన్నంటి ఉన్న నేతల ఫోన్లన్నీ ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. వీలు చూసుకుని రెండు రోజుల్లో సిట్ ముందు హాజరుకావాలని గంగిడికి సిట్ అధికారులు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పీసీసీ లీగల్‌ సెల్‌ కామారెడ్డి జిల్లా చైర్మన్‌ దేవరాజు గౌడ్‌ ఫోన్‌ను ట్యాపింగ్‌ చేసినట్లు తేలడంతో విచారణకు హాజరుకావాలని ఆయనకు కూడా సిట్‌ బృందం ఆదేశించింది. ఇకపోతే సోమవారం మేడ్చల్‌ కాంగ్రెస్‌ నేత హరివర్ధన్‌రెడ్డి, వరంగల్‌ కాంగ్రెస్‌ నేత సుధీర్‌రెడ్డి సిట్ ముందు హాజరై తమ ఫోన్ ట్యాపింగ్ వివరాలపై వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పలువురు బాధితులను సిట్‌ వరుసగా విచారిస్తోంది. వీరిచ్చే వివరాలతో నిందితులను ప్రశ్నించనుంది.

మాజీ సీఎస్ శాంతికుమారి స్టేట్‌మెంట్‌ రికార్డు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందర్ రావులను కూడా సోమవారం సిట్ విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ చీఫ్ టీ ప్రభాకర్‌రావు బృందం ట్యాపింగ్‌ కోసం సుమారు 618 ఫోన్‌ నంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టగా.. నాటి సీఎస్ శాంతి కుమారి ఆ ఫోన్ నెంబర్ల లిస్ట్‌ను కేంద్ర టెలికం శాఖకి పంపి అనుమతి తీసుకున్నట్లుగా సిట్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు వారిని విచారించి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో అప్పటి రివ్యూ కమిటీ సభ్యులు ఆనాటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్‌, అప్పటి ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ అనిల్‌ కుమార్‌లను కూడా సిట్ విచారించి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసింది.

2018 నుంచే ఫోన్ ట్యాపింగ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు టీ ప్రభాకర్ రావు వరుసగా ఆరోసారి సోమవారం మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తునట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారని సమాచారం. నాలుగేళ్లలో వేల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు వాంగ్మూలంలో వెల్లడించారు. ఆ డేటా అంతా పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ప్రభాకర్ రావుకు ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే ఆ పెన్ డ్రైవ్ ప్రభాకర్ రావు ఎవరికి ఇచ్చేవారో తనకు తెలియదన్న ప్రణీత్ రావు చెప్పారు. ట్యాపింగ్ డేటా పెన్ డ్రైవ్ ను ప్రభాకర్ రావు ఎవరికి ఇచ్చారనే దానిపై దర్యాప్తు కొనసాగుతుంది.