Telangana: పేరు గొప్ప.. ఊరు దిబ్బ! అవసరాలకు అక్కరకు రాని EHS ,JHS

- నిమ్స్ మినహా ఎక్కడా అమలు లేదు
- అక్కడ కూడా సవాలక్ష పరిమితులు
- రోడ్డు ప్రమాదంతో కోమాలో ఉన్న పేషంట్..
- ఈహెచ్‌ఎస్ వర్తించదన్న నిమ్స్ హాస్పిటల్
- ‘కేసీఆర్ మార్క్’ ఉద్యోగుల హెల్త్ స్కీమ్
- ఏ మాత్రం మార్పులు చేయని రేవంత్
- ఆవేదనలో ప్రభుత్వోద్యోగులు, జర్నలిస్టులు
JHS | EHS | Employees Health Scheme
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విధాత): ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్‌ల హెల్త్ స్కీమ్.. ఈ రెండూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీఆరెస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల కోసం తీసుకొచ్చిన పథకాలు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న సామెత చందాన.. ఉద్యోగులకు, జర్నలిస్ట్‌లకు ఆపత్కాలంలో ఆదుకునే విధంగా లేవు. దీంతో రోడ్డు ప్రమాదాలతో పాటు ఇతర కఠినమైన జబ్బులు వచ్చినప్పడు ఉపయోగపడటం లేదని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిత్యం కేసీఆర్ పాలసీలను తప్పు పట్టిన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత కనీసం ఈ స్కీమ్‌లో మార్పులు చేయక పోవడంపై ఉద్యోగులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోమాలోకి పోయిన పేషంట్‌కు నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్ వర్తించదని తేల్చి చెప్పారంటే.. కేసీఆర్ తీసుకొచ్చిన అతిపెద్ద ఉద్యోగుల హెల్త్ స్కీమ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఉద్యోగులు అంటున్నారు.
స్కూల్ టీచర్ల దంపతుల కుమార్తె ఈ నెల 17వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. రోడ్డుపైనే కారును పార్క్ చేసిన డ్రైవర్.. నిర్లక్ష్యంగా డోర్ తీయడంతో కారు పక్క నుంచే ఆ యువతి వెళుతున్న స్కూటీకి తగిలింది. దీంతో ఆ యువతి స్కూటీ పై నుంచి కింద పడింది. వెంటనే వెనుకాల వస్తున్న ద్విచక్రవాహనం రోడ్డుపై పడిన ఆ అమ్మాయిపై తల మీదుగా వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ యువతి తలకు బలమైన గాయమైంది. కోమాలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులైన టీచర్లు తమ కుమార్తెను అప్పటికప్పుడు యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్య ఖర్చులు భరించలేక.. ఆదివారం సాయంత్రం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వచ్చీరావడంతోనే తమ ఈహెచ్‌ఎస్ కార్డు ద్వారా ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు.
ఎమర్జెన్సీ నుంచి ఐసీయూకు మార్చిన తరువాత.. న్యూరో డిపార్ట్‌మెంట్‌కు కేసును బదిలీ చేశారు. బ్రెయిన్ డ్యామేజ్ అయినందున సర్జరీ చేయడం కష్టమని, వెంటిలేటర్ పైననే ఉంచి వైద్య చికిత్స అందించాలని న్యూరో డిపార్ట్‌మెంట్‌వాళ్లు సూచించారు. న్యూరోలో సర్జరీకే ఈహెచ్‌ఎస్ వస్తుంది కానీ.. ఇతర వైద్య సేవలకు వర్తించదని చెబుతూ డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోవాలని ఆసుపత్రి యజమాన్యం ఉచిత సలహా ఇచ్చింది. రోడ్డు యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాల పాలైన తమ బిడ్డకు ఈహెచ్‌ఎస్ మేరకు చికిత్స అందించమంటే డబ్బులు చెల్లించాలని చెప్పడమేమిటని ఆ దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు హెల్త్ కార్డు ఉన్న తరువాత కూడా అత్యసర వైద్యానికి చెల్లింపులు చేయాలనడం ఎంత వరకు సమంజసం అని అంటున్నారు.
ఈహెచ్‌ఎస్‌లో అన్నింటికీ వైద్య సేవలు అందడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. కార్డుదారులు కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వెళితే లోనికి కూడా రానీయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ రావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. కేసీఆర్ తన ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మనో ధైర్యం మీద దెబ్బతీశారని, ఉద్యోగ సంఘాలు తమ పరపతిని కోల్పోయాయని అన్నారు. దీంతో ఇప్పటికీ ఉద్యోగులు మనో ధైర్యంతో ముందడుగు వేయలేని పరిస్థితి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగులకు వైద్యసేవలతో పాటు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కూడా సరిగ్గా రావడం లేదని శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇన్సూరెన్స్ కాంపోనెంట్ కింద తాము కొంత సొమ్ము చెల్లిస్తామన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని టీఎన్జీవో సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ అన్నారు. తమ ఉద్యోగులకు వైద్య సేవలు అందించడానికి రూ.1000 కోట్లు అవసరం అవుతాయని, తమ వేతనాల నుంచి రూ.400 కోట్లు ఇస్తామని, మిగిలిన 600 కోట్లు గవర్నమెంట్ కాంపోనెంట్ కింద చెల్లించి స్కీమ్‌లు అమలు చేయాలని కోరినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు.