Modi | ఎవరూ ఊహించని విధంగా భారత్ ప్రతీకారం: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

  • By: sr    news    Apr 24, 2025 3:10 PM IST
Modi | ఎవరూ ఊహించని విధంగా భారత్ ప్రతీకారం: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

విధాత: జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా బిహార్‌లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. ఇవాళ దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నానని..పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఏ ఒక్కడినీ వదిలిపెట్టబోమని..దాడి చేసిన ఉగ్రవాదులను వెతికి వెంటాడుతామన్నారు. భూమి అంచుల వరకూ వారిని వెంటాడి పట్టుకుంటామన్నారు. ఉగ్రదాడి టూరిస్టులపై జరిగిన దాడి కాదని.. దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. ఎవరూ ఊహించని విధంగా భారత్ ప్రతీకారం ఉంటుందన్నారు.

ఉగ్రవాదం కోసం ఉపయోగిస్తున్న భూభాగాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు. అనంతరం దాడి గురించి ప్రధాని స్పందించారు. ‘‘ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందన్నారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయిందని.. ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడని.. కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయన్నారు. ఇది కేవలం పర్యటకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసం’’ అని మోదీ అన్నారు.

ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైందన్నారు. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని ప్రధాని గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదంతో భారత ఐకమత్య స్ఫూర్తిని బద్దలుకొట్టలేరని.. ఉగ్రవాదానికి శిక్ష తప్పదు అని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలిచారని.. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.