Digital Arrest Scam | డిజిటల్‌ అరెస్టు పేరిట వృద్ధ దంపతుల నుంచి కోటీ 20 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరస్తులు..

ఎవరైనా ఫోన్‌ చేసి, డిజిటల్‌ అరెస్టు చేస్తున్నామని చెబితే భయపడకూడదని పోలీసులు కోరుతున్నారు. ఏ పోలీస్‌ అధికారి ఫోన్‌ ద్వారా డబ్బు డిమాండ్‌ చేయరని స్పష్టం చేస్తున్నారు. నేరాలకు పాల్పడేవారు.. కేసులు క్లియర్‌ అయిన తర్వాత మీ సొమ్ము మీ ఖాతాల్లోకి వచ్చేస్తుందని చెబుతారని, అసలు అటువంటిదేమీ ఉండదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సైబర్‌ నేరాలకు గురైన వెంటనే 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి పూర్తి వివరాలు అందించాలని సూచిస్తున్నారు.

  • By: TAAZ |    news |    Published on : Oct 30, 2025 5:10 PM IST
Digital Arrest Scam | డిజిటల్‌ అరెస్టు పేరిట వృద్ధ దంపతుల నుంచి కోటీ 20 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరస్తులు..

Digital Arrest Scam | డిజిటల్‌ అరెస్టులనేవి ఉండవని, అవన్నీ సైబర్‌ నేరస్తుల మోసాలని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా.. చాలా మంది అదే మోసానికి గురవుతూనే ఉన్నారు. తాజాగా 82 ఏళ్ల రిటైర్డ్‌ ఆఫీసర్‌ దంపతులు సైతం ఈ మోసగాళ్ల బారిన పడ్డారు. తనను తన భార్యను దాదాపు కోటీ 20 లక్షల రూపాయల మేరకు మోసం చేశారని తెలుసుకున్న వృద్ధుడు ఆ దిగ్భ్రాంతిలో కుప్పకూలి చనిపోయారు. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఈ ఘటన అక్టోబర్‌ 22న చోటు చేసుకున్నది.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులమని, లేదా ప్రభుత్వా అధికారులమని బాధితులను బెదిరించి, తమ ఖాతాల్లోకి డబ్బులు తరలించుకోవడం, లేదా కీలక సమాచారాన్ని సేకరించడం వంటి పనులను సైబర్‌ నేరస్తులు చేస్తుంటారు. దీనికి వాళ్లు పెట్టే పేరు డిజిటల్‌ అరెస్ట్‌. ఈ నేరానికి పాల్పడే స్కామర్లు.. అరెస్టు చేస్తామని, బ్యాంకు ఖాతాలు సీజ్‌ చేస్తామని, లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యం ఉందని బెదిరింపులకు దిగుతారు. తాజా మోసం ఆగస్ట్‌, సెప్టెంబర్‌ నెలల్లో చోటు చేసుకున్నది. ముంబై సైబర్‌ పోలీస్‌, సీబీఐ అధికారిగా చెప్పుకొన్న నేరస్తుడు.. వృద్ధ దంపతులకు ఫోన్‌ చేసి.. మీ పేర్లు మనీ లాండరింగ్‌ కేసులో ఉన్నాయని, మీ ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని బెదిరించారు. ఎక్కడికీ వెళ్లవద్దని, ఇంటిలోనే ఉండాలని స్కామర్లు ఆ దంపతులను ఒత్తిడి చేశారు. సాధారణంగా సైబర్‌ నేరస్తులు చెప్పే కీలకమైన మాట ఇది. బాధితుల సెల్‌ఫోన్‌ కెమెరా ఆన్‌ చేయించి.. వారి కదలికలను నిత్యం గమనిస్తారు. ఇలా వరుసగా మూడు రోజులపాటు సైబర్‌ నేరస్తులు ఈ దంపతులను గుక్క తిప్పుకోనీయకుండా ఒత్తిడికి గురి చేశారు. ఐదు వేర్వేరు ఖాతాల్లోకి బాధితుల నుంచి సొమ్ము డిపాజిట్‌ చేయించుకున్నారు.

ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురూ విదేశాల్లో ఉంటున్నారు. అయితే.. ఈ విషయాలేవీ వారికి తెలియదు. తాము మోసపోయామని దంపతులు గుర్తించిన తర్వాత ఒక కుమార్తెకు ఫోన్‌ చేసి తెలియజేయగా.. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దానితో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము మోసపోయామని తెలిసిన దగ్గర నుంచీ తన భర్త తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని, జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న మొత్తం డబ్బును కోల్పోయామన్న బాధలో ఉన్నారని చెప్పారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. మనీ ట్రయల్‌ను, డిజిటల్‌ ఫుట్‌ప్రింట్స్‌ను ట్రేస్‌ చేసే పనిలో పడ్డారు.

డిజిటల్‌ అరెస్టు పేరుతో దేశంలో పెరుగుతున్న సైబర్‌ నేరాల విషయంలో తాజా కేసు తీవ్ర ఆందోళన రేపుతున్నది. ఒక్క మహారాష్ట్రలోనే 2025 జనవరి, ఆగస్ట్‌ నెలల మధ్యకాలంలో 218 కేసులు ఇటువంటివి వెలుగు చూశాయి. ఈ కేసులలో సైబర్‌ నేరస్తులు మొత్తం 112 కోట్లు కొట్టేశారు. ఈ కేసులలో 26 మాత్రమే పరిష్కారమయ్యాయి.