Digital Arrest Scam Explained | డిజిటల్‌ అరెస్టుల నుంచి సింపుల్‌గా బయటపడండిలా..

కాస్త బుర్రపెడితే.. సైబర్‌ నేరస్తులకు బురిడీ కొట్టించవచ్చు. అయితే.. వారి ఎత్తులను ముందు అర్థం చేసుకోవాలి. వారు పన్నిన గందరగోళం అనే వలలో చిక్కుకోకూడదు. ఇవిగో టిప్స్‌. ఈ అవగాహన పెంచుకుంటే మిమ్మల్ని ఏ సైబర్‌ క్రిమినల్‌ కూడా మోసం చేయలేడు.

Digital Arrest Scam Explained | డిజిటల్‌ అరెస్టుల నుంచి సింపుల్‌గా బయటపడండిలా..

Digital Arrest Scam Explained | డిజిటల్ అరెస్టుల పేరుతో ఇటీవల కాలంలో భారత్ లో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పోలీసులుగా, సీబీఐ, కస్టమ్స్ అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేసి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఏదో ఒక నేరంలో మీ పాత్ర ఉందని తప్పుడు ఆరోపణలు, పత్రాలు చూపి బెదిరిస్తారు. కేసులు కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని చెబుతారు. ఇలా రోజుకో కొత్త పద్దతిలో డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అధికారులుగా నటిస్తూ ఒకరిని సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేశారో విజయ్ పటేల్ అనే వ్యక్తి ఎక్స్ లో లైవ్ లో వివరించారు. నకిలీ పోలీసుల పోన్ కాల్స్ ను కూడా ఆయన ఈ సందర్భంగా లైవ్ లో చూపారు.

డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి?

టెక్నాలజీని ఉపయోగించుకొని మోసం చేసే ప్రజలను మోసం చేసే పద్దతినే డిజిటల్ అరెస్ట్ గా పిలుస్తారు. బాధితుడు లేదా బాధితురాలికి సైబర్ నేరగాళ్లు మొబైల్ లేదా ఈమెయిల్ లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా మేసేజ్ ద్వారా సంప్రదిస్తారు. మీపై చట్టపరమైన కేసు నమోదైందని.. అరెస్ట్ వారంట్ జారీ అయిందని భయపెడుతారు. అంతేకాదు అరెస్ట్ వారంట్, కోర్టు సమన్లు అంటూ తప్పుడు పత్రాలు చూపుతారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే ఫైన్ కట్టాలని బెదిరిస్తారు. బ్యాంకు వివరాలు అడుగుతారు. లేదా లింక్ పంపి మీ బ్యాంకు వివరాలు నింపాలని బెదిరిస్తారు.ఆ వివరాలు అందిస్తే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మాయం అవుతాయి. బాధితులతో సైబర్ నేరగాళ్లు మాట్లాడే సమయంలో అనుమానం రాకుండా వ్యవహరిస్తారు. మన నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత కానీ, మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కొల్లగొట్టిన తర్వాత కానీ మోసపోయిన విషయం మనకు అర్ధం కాదు.

ఎలా మోసం చేస్తారు?

ఆదాయపన్ను శాఖ, సీబీఐ, కస్టమ్స్, పోలీసులు, ట్రాయ్ అధికారులంటూ బెదిరింపులకు దిగుతారు. నిజమైన అధికారులు మాదిరిగానే జాగ్రత్త పడతారు. బాధితులతో మాట్లాడే సమయంలో ఎలాంటి తొట్రుపాటు లేకుండా ఉంటారు. బాధితులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తారు. తప్పుడు కేసులు, పత్రాలు చూపెడతారు. డ్రగ్స్ లేదా మహిళల అక్రమ రవాణా కేసుల్లో విచారణలో మీ పేరు బయటకు వచ్చిందనో, ఇంకా తీవ్రమైన నేరాలను ఆపాదిస్తారు. లేదా మీ పేరుతో వచ్చిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరిస్తారు. మీ ఆధార్ లేదా పాన్ కార్డు ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తారు. పోలీస్ స్టేషన్, కస్టమ్స్ ఆఫీస్ , సీబీఐ ఆఫీస్ మాదిరిగా తమ కార్యాలయాల నుంచి మాట్లాడుతున్నట్టుగా బాధితులను నమ్మించేలా సీన్ క్రియేట్ చేస్తారు. మిమ్మల్ని గుక్క తిప్పుకోనీయకుండా చేస్తారు. వాట్సాప్‌ వీడియో కాల్‌ ఆన్‌ చేయించి.. మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాల్‌ కట్‌ చేయవద్దని బెదిరిస్తుంటారు. ఆ సమయంలో చాలా మంది భయపడిపోతూ ఉంటారు. వారి వలలో చిక్కి.. డబ్బులు సమర్పించుకుంటారు.

ఎలా గుర్తించాలి?

ఎదుటివారి భయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడమే డిజిటల్ అరెస్టులో మోసగాళ్ల వ్యూహం. ఏదైనా కేసు నమోదైతే ఆ వివరాలపై సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం వస్తుంది. అంతేకానీ.. ఇలా ఫోన్‌ చేసి బెదిరించరు.  కానీ.. సైబర్‌ నేరస్తులు మాత్రం మీపై కేసు నమోదైంది.. ఫలానా కేసులో డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరిస్తారు. ఇలా బెదిరింపులకు పాల్పడిన వారిని సైబర్ నేరగాళ్లుగా గుర్తించాలి. బాధితులు వేరేవాళ్లతో మాట్లాడకుండా కట్టడి చేస్తారు. అంతేకాదు మిమ్మల్ని బెదిరిస్తూనే బ్యాంకు వివరాలు అడుగుతారు. లేదా ఈ కేసుల నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలని అడుగుతారు. మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయాలని కోరుతారు. ప్రైవేట్ నెంబర్స్ నుంచి సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తుంటారు. మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నదని తెలిసిన వెంటనే ఫోన్‌ కట్‌ చేసేసి.. స్విచాఫ్‌ చేసేయాలి. బంధువులు, స్నేహితులను సహాయం కోరాలి. పోలీసులను సంప్రదించాలి. ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి.. ఏ పోలీసు అధికారి కూడా డబ్బులు వ్యక్తిగత ఖాతాలోకి జమ చేయమని చెప్పరు. అలా వ్యక్తిగత ఖాతాలోకి జమ చేయాలని చెప్పాడంటే.. వాడు కచ్చితంగా సైబర్‌ మోసగాడేనని గుర్తించాలి.

ఎలా అడ్డుకోవాలి?

నిందితులు తప్పుడు ఆరోపణలు చేసిన సమయంలో ఆయా అధికారిక వెబ్ పోర్టల్ లోకి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఉదాహరణకు కస్టమ్స్ అధికారులుగా బెదిరిస్తే కస్టమ్స్ వెబ్ సైట్ లేదా ఆ కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా మీరు నివాసం ఉంటున్న ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీ వ్యక్తిగత డేటా, ఆధార్, పాన్ కార్డు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వంటి వివరాలు ఇవ్వవద్దు. మీ ఫోన్ లేదా, మెయిల్ కు వచ్చిన అనుమానాస్పద లింక్స్ ను క్లిక్ చేయవద్దు. మీకు ఫోన్ చేసిన వ్యక్తి పేరు, పనిచేసే కార్యాలయం, స్థలం, మొబైల్ నెంబర్, కార్యాలయం నెంబర్ ఇతర వివరాలు అడగాలి. సైబర్ నేరాల్లో కానీ, డిజిటల్ అరెస్టులో కానీ డబ్బులు కోల్పోతే 1930కి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు. అసలు డిజిటల్ అరెస్టులే ఉండవు. ఈమేరకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అడ్వైజరీ కూడా జారీ చేసింది. వీడియోకాల్, మెయిల్ ద్వారా, ఇతర సోషల్ మాడియా ద్వారా డిజిటల్ అరెస్టు అంటూ బెదిరింపులకు దిగితే మోసగాళ్లుగానే గుర్తించాలి.

ఇది ప్రాథమిక అవగాహన మాత్రమే. పూర్తి వివరాలకు, తీసుకోవాల్సిన రక్షణ చర్యలకు మీ సమీప సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించండి. మీరు సైబర్‌ నేరానికి గురైతే 1930కు నిర్భయంగా కాల్‌ చేసి ఫిర్యాదు చేయండి. గుర్తుంచుకోండి.. ఎంత సత్వరమే మీరు ఫిర్యాదు చేస్తే.. మీ సొమ్ము రికవరీకి మెరుగైన అవకాశాలు ఉంటాయి.

Telangana Cyber Crimes | భళారే విచిత్రం..! సైబర్​ మోసాలకు గురైన వారిలో ఐటీ నిపుణులే ఎక్కువ
Cyber Fraud | డబ్బులెవరికీ ఊరికే రావు.. మొత్తుకుంటున్నా వినలేదు.. 2 కోట్లకు మునిగారు!
Cyber ​​security | రైతులపై సైబర్ నేరగాళ్ల లింక్‌ల వల .. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ సెక్యూరిటీ