కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ నిబంధన ఎత్తి వేయాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కుర్ లో బీసీ ఉద్యోగుల బహిరంగ సభలో ఆయన హాజరై మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెడతామన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యంగా పరమైన, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీలేవు. రాజ్యాంగ బద్ధమైన మండల్ కమీషన్ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసింది.
చట్టబద్దమైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నాచియప్పన్ కమిటీ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసింది. ఇక ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ రిజర్వేషన్ల కేసు సందర్భంగా జనాభా ప్రకారం ఉద్యోగుల సంఖ్య లేకపోతే SC/ST/BC లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని తీర్పు చెప్పింది. అన్ని వైపుల నుంచి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని బలమైన సిఫార్సులున్నాయి. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నారని తెలిపారు.
క్రిమిలేయర్ బీసీలకే ఎందుకు?
విద్యా, ఉద్యోగ నియామకాలలో బీసీ రిజర్వేషన్ల పై క్రిమిలేయర్ నిబంధన విధించిన తీరు బీసీలపై వివక్ష, చిన్న చూపు చూస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుందని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఆరు రిజర్వేషన్ల వర్గాలు ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులు/ ఎన్సీసీ / మహిళ రిజర్వేషన్లకు లేని క్రిమిలేయర్ బీసీలకే ఎందుకు విధించారు? రిజర్వేషన్ల లక్ష్యం అర్ధికాభివృద్ధి కాదు అని, పాలనలో బీసీలకు భాగస్వామ్యం కల్పించడం ఒకటైతే.. రిజర్వేషన్ల ద్వారా చదువు, ఉద్యోగం తద్వార అధికారం లో ఈ వర్గాల సామజిక హోదా పెంచడం ఇంకొక భాగం అన్నారు. కాని అర్ధం పర్ధం లేని క్రిమిలేయర్ బీసీలకే ఎందుకు కల్పించడం అని, ఇదీ బీసీల పట్ల వివక్షత కాదా? అని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలి..
పార్లమెంట్ లో బీసీల బిల్లు పెట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని కృష్ణయ్య తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలని కోరారు. బీసీల విద్యా,ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలని, బీసీలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హై కోర్టు సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో SC/ST/BC-రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని కోరుతున్నామన్నారు. ప్రైవేటు రంగంలో SC/ST/BC లకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి, ముత్యం వెంకన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్,యాదగిరి,కళాబృందం రామలింగం, డప్పు స్వామి కలిమల నరసింహ, ఎడ్ల మహాలింగం,నరేష్ ముదిరాజ్,అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
ఎక్స్ హ్యాండిల్ బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టుకు కాక్రోచ్ జనతా పార్టీ
రైతుల కోసం హమాలీలకు రూ.10లక్షల 20వేల ఆర్థిక సహాయం: రాజగోపాల్ రెడ్డి
