Telangana: నేటి నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

- రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ
- ఒక్కో గ్రామంలో వారంపాటు శాస్త్రవేత్తలు
- లాభదాయక సాగుపై రైతులకు సూచనలు
- ఎరువులు, అధిక దిగుబడులపై సలహాలు
హైదరాబాద్, (విధాత): వానకాలం సాగుకు రైతాంగాన్ని పూర్తిగా సంసిద్దం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు రైతుల వద్దకు నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలను పంపిస్తోంది. గ్రామాలలోకి వెళ్లే వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో మాట్లాడుతారు. భూమిని పరీక్షించి, అధిక దిగుబడి వచ్చే విధంగా వేయాల్సిన పంటలు, అనుసరించాల్సిన పద్దతులను వివరిస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 200 శాస్త్రవేత్తల బృందాలు అన్ని గ్రామాలలో పర్యటిస్తాయి. ఒక్కో బృందంలో నలుగురు సభ్యులు ఉంటారు. ఒక్కో శాస్త్రవేత్తల బృందం ఒక్కో గ్రామంలో వారం పాటు పర్యటించనున్నది.
ఇలా ఆరు వారాలపాటు ఈ బృందాలన్నీ తెలంగాణలోని 1200 గ్రామాలలో పర్యటించి రైతులు వానాకాలంలో సాగు చేసే పంటల వివరాలు సేకరించడంతో పాటు ఏ పంటలు వేయాలి, ఎరువులు ఎలా వినియోగించాలి, మంచి దిగుబడి కోసం పంట ఏ దశలో ఉంటే ఏవిధమైన చర్యలు తీసుకోవాలన్న విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిస్తారు. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాల అధికారుల బృందాల చేత రైతు ముగిట్లో శాస్త్ర వేత్తల కార్యక్రమాన్ని సోమవారం నుంచి చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటనలో వెల్లడించింది.