Rift in East Africa | ఆఫ్రికా రెండు ముక్కలు.. ఆరో మహా సముద్రం ఆవిర్భావం?
హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహా సముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటిక్ మహాసముద్రము.. అని మనం ఇప్పటిదాకా చదువుకున్నా. కానీ.. ఇకపై మహా సముద్రాలెన్ని అంటే.. ఆరు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే..

- తూర్పు ఆఫ్రికాలో చీలిక చెబుతున్న వింత సంగతులు
- ఎర్రసముద్రం, ఆడెన్ గల్ఫ్ కలయికతో కొత్త మహాసముద్రం
- భూభౌతిక పరిశోధకుల వెల్లడి
Rift in East Africa | హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహా సముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటిక్ మహాసముద్రము.. అని మనం ఇప్పటిదాకా చదువుకున్నా. కానీ.. ఇకపై మహా సముద్రాలెన్ని అంటే.. ఆరు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఈ ఆరో మహా సముద్రం క్రమంగా ఏర్పడే దశలో ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ప్రపంచాన్ని మార్చివేయగలదని అంటున్నారు. ఆఫ్రికాలో ఓ భారీ జియోలాజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ చోటు చేసుకుంటున్నది. ఇది క్రమంగా కొత్త మహాసముద్రంగా అవతరిస్తుందని చెబుతున్నారు. తూర్పు ఆఫ్రికాలో కనిపిస్తున్న భారీ చీలిక.. ఈ ఖండాన్ని మార్చివేయగలదని అంటున్నారు. మెల్లగానే అయినా.. స్థిరమైన వేగంతో టెక్టానిక్ ప్లేట్లు విడిపోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. రాబోయే కొన్ని లక్షల సంవత్సరాల్లో ఈ భూమిపై ఆరో మహా సముద్రం ఆవిర్భవిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అనేది వేల కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన ఉన్న టెక్టానిక్ ప్లేట్ చీలికగా చెబుతున్నారు. ఇది కొత్త మహాసముద్రం ఏర్పాటుకు దారి తీస్తుందని అంటున్నారు. 2005 నుంచి 35 మైళ్ల పొడవున్న భూ చీలిక విస్తీర్ణం పెరగటాన్ని ఇథియోపియా ఏడారిలో గుర్తించారు. ఇది మహత్తర భూభౌగోళిక మార్పునకు సంకేతమని చెబుతున్నారు. మూడు ప్రధాన టెక్టానిక్ ప్లేట్లు.. ఆఫ్రికన్, సోమాలి, అరబ్ ప్లేట్లు మెల్లగా వేరుపడుతుండటంతో ఇథియోపియా ఎడారిలో రిఫ్ట్ ఏర్పడిందని మిర్రర్‌లో ప్రచురితమైన కథనం పేర్కొంటున్నది. ఈ కదలికలు మానవ కాలమానాలకు అంతుచిక్కనివిగా ఉన్నాయి. అయినా.. ఆఫ్రికా ఖండాన్ని రెండు ముక్కలుగా చీల్చే పరివర్తనకు నాంది పలుకుతున్నదని ఆ కథనం పేర్కొన్నది.
భూమి ఉపరితలంలో భారీ విభాగాలే టెక్టోనిక్ ప్లేట్లు. ఇవి ద్రవం తరహా మాంటిల్ పైన తేలుతూ ఉంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాలుగా వాటి కదలికలు ప్రస్తుత భూమి ఆకారాన్ని సంతరింపజేశాయి. ఈ టెక్టోనిక్ ప్లేట్లు కదులుతూ ఖండాలు ఏర్పడ్డాయి. అవి ఢీకొనడంతో పర్వతాలు ఉద్భవించాయి. ఇవి ఎప్పుడూ స్థిరంగా లేవు. కాకపోతే.. ఆ కదలికలు లక్షల సంవత్సరాలకు గానీ కనిపించవు. మధ్యమధ్యలో అక్కడా ఇక్కడా వచ్చే భూకంపాలు కూడా ఈ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనే సమయంలో సంభవించేవే. ఇప్పుడు గుర్తించిన తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ (భూమి చీలిక) విషయానికి వస్తే.. సోమాలీ ప్లేట్.. నుబియన్ ప్లేట్ నుంచి నెమ్మదిగా దూరమవుతున్నది. కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైన దక్షిణ అమెరికా, ఆఫ్రికా పురాతన విభజనను ఇది గుర్తు చేస్తున్నది. ఒకప్పుడు దక్షిణ అమెరికాతో కలిసి ఉన్న ఆఫ్రికా.. ప్లేట్ల కదలికల కారణంగా ప్రత్యేక ఖండంగా ఆవిర్భవించింది. ఈ కేసులో ఏటా కొన్ని మిల్లీమీటర్ల చొప్పున విస్తరించే ఈ చీలిక.. క్రమంగా లోయగా ఏర్పడుతుంది. ఎర్ర సముద్రం, ఆడెన్ గల్ప్ నీటితో అది నిండిపోయి.. అంతిమంగా కొత్త మహాసముద్రం ఉనికిలోకి వచ్చేందుకు దోహదం చేస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సముద్ర భూభౌతిక శాస్త్రవేత్త.. ప్రొఫెసర్ కెన్ మెక్‌డొనాల్డ్ చెప్పారు. ఆ మిగిలిన ముక్క వేరే ఖండంగా ఆవిర్భవిస్తుందని తెలిపారు. తద్వారా రెండు ఆఫ్రికా ఖండాల్లో ఏర్పడే తీర ప్రాంతాలు ఆర్థిక కార్యకలాపాలకు చోదక శక్తులవుతాయి. అయితే.. ఇది జరగడానికి కూడా లక్షల సంవత్సరాలు పడుతుంది.