Salmankhan: సల్మాన్ ఖాన్.. రామ్ జన్మభూమి వాచ్ రగడ !

Salmankhan:
విధాత: తన సినిమా సికందర్ సినిమా ప్రమోషన్ ప్రారంభించిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తన చేతికి రూ. 61 లక్షల విలువైన విలాసవంతమైన పరిమిత ఎడిషన్ రామ్ జన్మభూమి వాచ్‌ను ప్రదర్శిస్తూ సికిందర్ సినిమాను ప్రమోట్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు ఈ వాచ్ వ్యవహారం రచ్చ రేపుతోంది. తన రాబోయే చిత్రం సికందర్ విడుదలకు సిద్ధమవుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ విలాసవంతమైన, పరిమిత ఎడిషన్ రామ జన్మభూమి వాచ్‌ను ప్రదర్శిస్తున్న చిత్రాలను ఇన్ స్ట్రాలో షేర్ చేశారు.
లగ్జరీ బ్రాండ్ జాకబ్ & కో రూపొందించిన ఈ వాచ్‌లో అయోధ్య రామమందిరం, రాముడు, హనుమంతుడు, ఇతర పవిత్ర చిహ్నాలు ఉన్నాయి. పోస్ట్‌లో సల్మాన్ ఖాన్ నీలిరంగు చొక్కా ధరించి తన కాషాయ రంగు అయోధ్య గడియారాన్ని ప్రదర్శిస్తూ, “మార్చి 30న థియేటర్లలో కలుద్దాం ” అని క్యాప్షన్ ఇచ్చారు. ‘ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి రోజ్ గోల్డ్ ఎడిషన్’ అని పిలువబడే ఈ అద్భుతమైన టైమ్ పీస్ లగ్జరీ బ్రాండ్ వాచ్ జాకబ్ & కో సంస్థ తయారు చేసింది.
సల్మాన్ ఖాన్ రామ జన్మభూమి వాచ్ ధరించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం జమాత్(ఏఐఎంజే) అధ్యక్షుడు షాబుద్ధిన్ రజ్వీ తప్పుబట్టారు. ముస్లింలు రామమందిరాన్ని, లేదా ముస్లిమేతర విషయాన్ని ప్రచారం చేయడం షరియత్ చట్ట విరుద్ధం.. నిషేధితమని స్పష్టం చేశారు. ఇలాంటి వాటికి సల్మాన్ ఖాన్ దూరంగా ఉండాలని కోరారు. ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పశ్చాత్తపం ప్రకటించాలని, షరియత్ సూత్రాలను పాటించాలని సూచించారు.
అయితే సల్మాన్ అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతని లౌకికవాదాన్ని ప్రశంసించారు. బజరంగీ భాయిజాన్‌లో అతను హనుమాన్ భక్తుడి పాత్రను పోషించి ప్రజల ప్రేమను గెలుచుకోగలిగినప్పుడు, ఈ గడియారం ధరించడం పెద్ద విషయం కాదన్నారు. మరికొందరేమో ఇదో కొత్త వివాదంశమని..అయితే నిజాయితీగా చెప్పాలంటే దీన్ని చూసి సంతోషంగా ఉన్నానని కామెంట్ చేశారు. మరికొందరు సినిమా కోసం సల్మాన్ ఖాన్ వేసిన పబ్లిసిటీ ఎత్తుగడగా కొట్టిపారేశారు.
వరుస వివాదాలలో.. సల్మాన్ ఖాన్
ఇటీవల సల్మాన్ ఖాన్ వివాదాల్లో చిక్కకుంటున్నారు. కృష్ణ జింకలను వేటాడిన కేసు నేపథ్యంలో బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో ఉన్న సల్మాన్ తాజాగా దక్షిణాది ప్రేక్షకులపై అనుచిత వ్యాఖ్యలతో వివాదస్పదమయ్యారు. దక్షిణాది ప్రేక్షకులు హిందీ సినిమాలను ఎక్కువగా చూడరని..అదే సమయంలో ఉత్తరాది వారు మాత్రం దక్షిణాది సినిమాలు చూస్తారని అందుకే వారి సినిమాల సక్సెస్ రేటు ఎక్కువని కామెంట్ చేశాడు. అయితే సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలకు దక్షిణాది ప్రేక్షకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
సల్మాన్ నటించిన ప్రేమ పావురాలు, ప్రేమాలయం, క్రిష్, 3ఇడియట్స్, ధూమ్, ధూమ్ 2, భజరంగీ భాయ్ జాన్ సినిమాలు సౌత్ లో, ముఖ్యంగా తెలుగులో కూడా హిట్ అయిన సంగతి సల్మాన్ ఖాన్ మరిచిపోయి దక్షిణాది ప్రేక్షకులను నిందించడం సరికాదని చురకలేశారు. హిందీ సినిమాల మేకింగ్.. ముఖ్యంగా కథ, కథనాలు సక్రమంగా లేకపోవడంతోనే ఫెయిల్యూర్ అవుతున్నాయని..కంటెంట్ బాగున్న హిందీ సినిమాలు హిట్ అయిన సంగతి మరువద్ధంటూ పలువురు సల్మాన్ కు హితవు పలికారు. తాజాగా రామ జన్మభూమి వాచ్ తో మరోసారి వివాదస్పదమయ్యారు.