China Imports | చైనా దిగుమతులను అడ్డుకోవాలి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్

China Imports | చైనా దిగుమతులను అడ్డుకోవాలని, విదేశీ ఈ కామర్స్ దిగ్గజాలను కట్టడి చేయాలని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వీటిని ‘21వ శతాబ్దపు ఈస్ట్ ఇండియా కంపెనీ’గా అభివర్ణించింది. 2024..25 ఆర్థిక సంవత్సరంలో 113.5 బిలియన్ డాలర్ల వాణిజ్యంతో భారతదేశానికి చైనా అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్నది. విదేశీ వస్తువుల వాడకానికి దూరంగా ఉండాలని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని కోరుతూ స్వదేశీ జాగరణ్ మంచ్ బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది.
‘చైనా ఉత్పత్తుల దిగుమతులను అడ్డుకోవాలని, ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు దేశీయ ప్రయోజనాలను కాపాడాలని మేం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని మంచ్ కో కన్వీనర్ అశ్విని మహాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విదేశీ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీలు.. కారుచౌకగా వస్తువులను అమ్మకుండా నియంత్రించాలని కూడా స్వదేశీ జాగరణ్ మంచ్ కోరింది. ‘నవ డిజిటల్ గుత్తశక్తులు.. అమెజాన్, వాల్‌మార్ట్ (ఫ్లిప్‌కార్ట్) తదితర ఈ కామర్స్ సంస్థలు.. 21వ శతాబ్దపు ఈస్ట్ ఇండియా కంపెనీని తలపిస్తున్నాయని మహాజన్ విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సాయుధ దళాలు ఉగ్రమూకలపై దాడులు చేస్తుంటే.. చైనా, టర్కీ వంటి దేశాలు పాకిస్తాన్‌కు ఎలా అండగా నిలిచాయో చూశామని మహాజన్ అన్నారు. మన దేశాన్ని స్వయం సమృద్ధిగా తయారు చేసుకోవాల్సిన, ఇతర దేశాలపై, ప్రత్యేకించి స్నేహపూర్వకంగా వ్యవహరించని దేశాలపై ఆధారపడకూడదని అవసరాన్ని దేశ ప్రజలు గుర్తించారని చెప్పారు.